ఏపీ కాంగ్రెస్ చీఫ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హఠాత్తుగా మార్చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాధ్ ను మార్చేసి గిడుగు రుద్రరాజును నియమించింది. ఈ హఠాత్ మార్పు పార్టీలోని చాలామందిని ఆశ్చర్యపరిచింది. సాకేను మారుస్తున్నట్లు అధిష్టానం తరపున కొద్దిపాటి సంకేతాలు కూడా ఎవరూ గ్రహించలేకపోయారు. సరే సాకేను తీసేసి రుద్రరాజును నియమించినంత మాత్రాన పార్టీకి జరిగే లాభనష్టాలు ఏమీలేవు.





కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అద్యక్షుడిగా ఎవరున్నా ఒకటే. పార్టీ బలోపేతానికి సాకే చేసిందేమీ లేదు రేపు రుద్రరాజు చేయగలిగేదీ ఏమీలేదు. ఇంతోటి దానికి సాకేను అధిష్టానం మార్చేయటం వెనుక వైసీపీ హస్తముందని ఎల్లోమీడియా బురదచల్లేసింది. వైసీపీ ప్రయోజనాల కోసమే సాకేను మార్చి రుద్రరాజును అధ్యక్షుడిని చేసేట్లుగా కాంగ్రెస్ లోని ఒక సీనియర్ నేత చక్రంతిప్పారట. ఇంతకీ విషయం ఏమిటంటే సాకే తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని అనుకున్నారట.





సాకే గనుక పాదయాత్ర చేస్తే పార్టీకి పూర్వవైభవం వచ్చేస్తుందని తమకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నాయకత్వం టెన్షన్ పడిందట. కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తే చాలావర్గాలు వైసీపీని వదిలేస్తాయని వైసీపీ నాయకత్వంలో ఆందోళన పెరిగిపోయిందట. అందుకని ఎలాగైనా సాకే పాదయాత్రకు బ్రేకులు వేయించేట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేతను వైసీపీ నాయకత్వం ప్రభావితం చేసిందట.




దాంతో వైసీపీ ప్రయోజనాలను కాపాడేందుకే సదరు సీనియర్ నేత అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి అద్యక్షుడిగా సాకేను తప్పించి రుద్రరాజును నియమించేట్లుగా చక్రం తిప్పారట. ఈ విషయంపై బాహాటంగానే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోందట. ఎప్పుడైతే అసలు విషయం బయటపడిందో అప్పటినుండి కాంగ్రెస్ లోని చాలామంది సీనియర్లు సదరు సీనియర్ నేతతో పాటు వైసీపీపై తీవ్రంగా మండిపోతున్నారట. ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీకే దిక్కులేనపుడు సాకే పాదయాత్ర చేస్తే మాత్రం వైసీపీకి వచ్చే నష్టమేమిటి ?  2014, 19 ఎన్నికల్లో శింగనమలలో ఓడిపోయిన సాకే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని ఎల్లోమీడియా చెప్పటమే విచిత్రంగా ఉంది. 






మరింత సమాచారం తెలుసుకోండి: