చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కోబోతున్నారు. ఈ ఇద్దరినీ సోమవారం హైదరాబాద్ లోని  తమ కార్యాలయంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు హయాంలో అంటే 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని పెట్టారు. సెంటర్ జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్ధతో ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం విలువ రు. 3350 కోట్లు.





స్కిల్ డెవలప్మెంట్ ఎవరికోసం పెట్టారో ? ఎంతమందికి శిక్షణను ఇచ్చారో ? ఏఏ రంగాల్లో శిక్షణిచ్చారో కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. అయితే సెంటర్ ఏర్పాటు, నిర్వహణ పేరుతో వేలాది కోట్లరూపాయలు ఖర్చయిపోయింది.  సెంటర్ ఏర్పాటులో ప్రభుత్వం వాటా 370 కోట్లు కాగా మిగిలింది సీమెన్సే పెట్టుకోవాలి. అయితే ప్రభుత్వ వాటా విడుదలైపోయింది కానీ సీమెన్స్ వాట ఎంత విడుదలైందో ? ఎంత ఖర్చుచేశారు ? ఏ రూపంలో ఖర్చుచేశారనే విషయంలో సరైన లెక్కలులేవు.





సంస్ధమీద వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. ఇందులో సుమారు రు. 241 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారణమైంది. సెంటర్ నిర్వహణ మొత్తాన్ని అప్పట్లో ఛైర్మన్ హోదాలో గంటా సుబ్బారావు, డైరెక్టర్ గా లక్ష్మీనారాయణే చూసుకున్నారు. వీళ్ళిద్దరు చంద్రబాబు అత్యంత సన్నిహితులు. వీళ్ళపైన వచ్చిన ఆరోపణలపై గతంలో కూడా ప్రభుత్వం  విచారణ జరిపించింది. అయితే వీళ్ళు కోర్టులో పిటీషన్ వేశారు. ఇదే సమయంలో ఆర్ధిక అవకతవకలను గుర్తించిన ప్రభుత్వం లోతైన విచారణకు కేసును ఈడీకి అప్పగించింది.






దాంతో రంగంలోకి దిగిన ఈడీ లోతుగా విచారణ జరిపిస్తే అందులో రు. 241 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. వందల కోట్లను దారిమళ్ళించేందుకు షెల్ కంపెనీలను కూడా ఏర్పాటుచేశారని నిర్ధారణైంది. దీంతో స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికీ ఈడీ నోటీసులిచ్చింది. వీరిలో సుబ్బారావు, లక్ష్మీనారాయణదే కీలకపాత్ర. మరి వీళ్ళు ఈడీ విచారణకు హాజరవుతారా లేకపోతే కోర్టులో పిటీషన్ వేసి స్టే తెచ్చుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: