ఉన్నట్లుండి ఇంతకాలానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ఇంతకీ ఆ షాక్ ఏమిటంటే రోడ్డూ లేదు మ్యాపూ లేదని తేల్చేసింది. ఇంతకాలంగా పవన్ అడుగుతున్న రోడ్డుమ్యాప్ గురించి పవన్నే అడగమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ సహ ఇన్చార్జి సునీల్ దియోధర్ చెప్పారు. పవన్ అడిగిన రోడ్డుమ్యాపును తాము ఎప్పుడో ఇచ్చేశామని కూడా చెప్పారు.





పవన్ కు కొత్తగా ఇవ్వటానికి తమ దగ్గర ఎలాంటి రోడ్డుమ్యాపు లేదన్నారు. పవన్ కోరుకుంటున్న రోడ్డుమ్యాప్ బీజేపీ ఎప్పుడో ఇచ్చేస్తే మరి పవన్ మాత్రం ఇంకా రోడ్డుమ్యాపు కావాలని ఎందుకు గోలచేస్తున్నారు. రోడ్డుమ్యాపు గురించి ఈమధ్యనే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాట్లాడుతు తొందరలోనే రోడ్డుమ్యాప్ వస్తుందని ఎందుకు చెప్పినట్లు ? ఆమధ్య నరేంద్రమోడీ విశాఖపట్నం పర్యటనలో పవన్ కలిశారు గుర్తుంది కదా. అప్పట్లోనే మోడీని పవన్ రోడ్డుమ్యాప్ కావాలన్నారు.





మోడీ బదులిస్తు ప్రత్యేకించి  రోడ్డూలేదు మ్యాపూ లేదన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అంశాల వారీగా పోరాటలు  చేయటమే తప్ప ప్రత్యేకించి రోడ్డుమ్యాపంటు ఏమీ ఉండడని అప్పట్లోనే తేల్చేశారు. మోడీ అంతచెప్పిన తర్వాత కూడా వివిధ వేదికలపై పవన్ రోడ్డుమ్యాపు కోసం ఎదురు చూస్తున్నట్లు చాలాసార్లు చెప్పారు. అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే రెండుపార్టీలు కూడా డ్రామాలు ఆడుతున్నయాని.





బీజేపీతో మాత్రమే  కలిసి ఎన్నికల్లో పోటీచేయటం పవన్ కు ఇష్టంలేదు. టీడీపీని కూడా కలుపుకుని వెళ్ళాలన్న పవన్ ప్రతిపాదనకు బీజేపీ అగ్రనేతలు కుదరదంటున్నారు. దీంతో  రెండుపార్టీల మధ్య బంధం ఎప్పుడు విడిపోతుందో అన్నట్లుగా తయారైంది. ఇదే సమయంలో బీజేపీని వదిలించుకుని టీడీపీతో పొత్తుపెట్టుకునేంత ధైర్యం పవన్లో లేదు. అందుకనే రోడ్డుమ్యాపు డ్రామా ఆడుతున్నట్లున్నారు. ఏదో పద్దతిలో బీజేపీతోనే పొత్తు వద్దనిపించుకోవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతోంది. అంతా బాగానే ఉంది కానీ ఢిల్లీలో పవన్ను ఆదరించే కమలంనేతలు ఎవరైనా ఉన్నారా అంటే అది దేవధర్ మాత్రమే. అలాంటి దేవధరే ఇపుడు రోడ్డుమ్యాపు విషయాన్ని పవనే అడగండని దులిపేశారంటే అర్ధమేంటి ?



మరింత సమాచారం తెలుసుకోండి: