తెలంగాణలో ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇంకా పూర్తికాలేదు. ప‌రిష‌త్ ఎన్నిక‌లు ముగియ‌డంతో..ఇక మున్సిప‌ల్ పోరుకు ఎన్నిక‌ల క‌మీష‌న్ సిద్ద‌మౌతుంది. జులై మొద‌టి వారంతో మున్సిపాలిటీల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో..ఈ లోగా నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు రంగం సిద్దం చేస్తోంది ఈసీ. మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం కూడా తొంద‌ర‌ప‌డుతోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కొంత వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన‌ట్లు క‌నిపించినా, తాజా ప‌రిష‌త్ ఫ‌లితాల‌తో అధికార పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే ఉత్సాహంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని భావిస్తోంది.


మున్సిప‌ల్ ఎన్నిక‌లే కాదు, త్వ‌ర‌లో హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు కూడా నోటిఫికేష‌న్ రానుంది. ఉత్త‌మ్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసినందున‌.. దీనిపై కూడా ఈసీ దృష్టి పెట్ట‌నుంది.


ఇక హుజూర్ న‌గ‌ర్ సిట్టింగ్ స్థానాన్ని మ‌రోసారి కైవ‌సం చేసుకునేందుకు ఓ ప‌క్క హ‌స్తం పార్టీ క‌స‌ర‌త్తులు చేస్తుండ‌గా..ఎలాగైనా కాంగ్రెస్ కంచుకోట‌ను కూల్చేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే..హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు ఇంకో రెండు నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి.కానీ, ఇప్ప‌టి నుంచే అభ్య‌ర్థుల ఎంపిక‌పై పార్టీలు దృష్టి పెట్టాయి.


అధికార టీఆర్ఎస్ నుంచి క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు వినిపిస్తున్నా ఆమె పోటీకి విముఖంగా ఉన్న‌ట్లు స‌మాచారం.ఈ నేప‌థ్యంలో మ‌రోసారి శానంపూడి సైదిరెడ్డికే టికెట్ ద‌క్కే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. మాజీ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ ఇదివ‌రకే ప్ర‌క‌టించి ఉన్నారు.దీంతో..సైదిరెడ్డికి టికెట్ ఖాయంగా క‌నిపిస్తుంది.


ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు పెద్ద‌గానే ఉంది. వాస్త‌వానికి ఇక్క‌డి నుంచి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కుటుంబ స‌భ్యులైతేనే గెలుపు అవ‌కాశాలు అధికంగా ఉంటాయి.కాబ‌ట్టి ఆయ‌న స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి పోటీ చేస్తే బాగుంటుంద‌ని అంతా భావించారు. కానీ, పోటీకి ఆమె సుముఖంగా లేర‌ని ఉత్త‌మ్ చాలా స్ప‌ష్టంగా చెప్పారు. ఈ నేప‌థ్యంలో కొత్త వ్య‌క్తిని వెతికే ప‌నిలో ప‌డింది అధిష్టానం.


దీంతో.. టికెట్ ద‌క్కించుకునేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లు బిజీ అయిపోయారు.అధిష్టానానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటున్న వారి లిస్టు రోజురోజుకీ పెరుగుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం ప‌టేల్ ర‌మేష్ రెడ్డిదే.ఈయ‌న రేవంత్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు. రేవంత్ తో పాటు టీడీపీకి రాజీన‌మా చేసి కాంగ్రెస్ లో చేరిన వాళ్ల‌లో ఇత‌ను కూడా ఒక‌రు. పార్టీలో చేరిన స‌మ‌యంలో ప‌టేల్ ర‌మేష్ రెడ్డికి సూర్య‌పేట టికెట్ పై హామీ ఇచ్చారు. కానీ, అక్క‌డి నుంచి సీనియ‌ర్ నేత,మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి పోటీకి దిగ‌డంతో ఆయ‌న పోటీకి దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ టికెట్ ఇస్తామ‌ని మ‌రోసారి ప‌టేల్ ర‌మేష్ రెడ్డికి హామీ ఇవ్వ‌డం జ‌రిగింది. ఆఖ‌రికి ఈ హామీ కూడా నెర‌వేర‌లేదు. చివ‌రి నిమిషంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప‌టేల్ ఆశ‌లు ఆవిర‌య్యాయి.


అయితే.. న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ స్థానాన్ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కోసం త్యాగం చేసినందున.. తాజాగా ఉత్త‌మ్ రాజీనామా చేసిన హుజూర్ న‌గ‌ర్లో ప‌టేల్ ర‌మేష్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి. మ‌రోవైపు..రేవంత్ రెడ్డి సైతం త‌న అనుచ‌రుడైన ప‌టేల్ కు టికెట్ ఇస్తే తాను హుజూర్ న‌గ‌ర్లోనే మ‌కాం వేసి పార్టీని గెలిపించి తీర‌తాన‌ని అధిష్టానానికి హామీ ఇచ్చార‌ట‌. ఓ వైపు ఉత్త‌మ్ సిట్టింగ్ స్థానం కావ‌డం,మ‌రో వైపు రేవంత్ అనుచ‌రుడికి టికెట్ ఇవ్వ‌డం జ‌రిగితే..ఖ‌చ్చితంగా కాంగ్రెస్ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తుంద‌న్న భ‌రోసాతో టికెట్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డికే ఇచ్చేందుకు హైక‌మాండ్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.


ఇక‌పోతే..కోదండ‌రాం,శంక‌ర‌మ్మల పేర్లు కూడా వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ టీఆర్ఎస్ నుంచి క‌విత‌ను పోటీకి దింపితే విప‌క్ష పార్టీలన్నీ ఏక‌మై ఓ బ‌ల‌మైన ఉద్య‌మ శ‌క్తిని బ‌రిలో దింపాల‌ని భావించాయి.కానీ, క‌విత పోటీకి విముఖ‌త చూప‌డంతో ఇక కాంగ్రెస్ కూడా త‌మ పార్టీ అభ్య‌ర్థికే టికెట్ ఇవ్వాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది.మొత్తానికి ప‌టేల్ ర‌మేష్ రెడ్డి పేరు హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో బ‌లంగా వినిపిస్తోంది. చూడాలి మ‌రి ఆఖ‌రి నిమిషంలో.. కాంగ్రెస్ సీనియ‌ర్లు ఏమైనా అడ్డంప‌డ‌తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: