ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన నెల రోజుల వ్యవధి పూర్తి చేసుకుంది.  ఈ నెల రోజులలో కొన్ని మెరుపులు మరి కొన్ని నిట్టూర్పులు, కొన్ని విశేషాలు మరి కొన్ని అవశేషాలు కలిసిన అంశాలను పరిశీలిద్దాం.  సరిహద్దులకు మాత్రమే హద్దులకుంటాయి కాని ఆలోచన, ఆశయఆచరణలకు కాదు అన్న సిద్ధాంతంతో జగన్ గారి పాలన ఈ నెలంతా కొనసాగింది.  ముఖ్యంగా మూడు అంశాలతో జగన్ గారు ప్రజలు మరియు ప్రతిపక్షనాయకుల ఆశ్చర్యానికి కేంద్రబిందువయ్యారు.

మొదటిది ఆంధ్ర నాయకులతో పాటు ప్రజలను అతి హేయంగా చూసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తో జగన్ కలుపుగోలుతనం పై రాజకీయ విమర్శకులు సైతం విస్మయం చెందారు.  పక్కపక్క రాష్ట్రాలన్నపుడు ఆ మాత్రం కలుపుగోలుతనం అవసరం అన్న వాళ్లూలేకపోలేదు కాని మరీ ఇంతలా వుండడం చూసి సాధారణ ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు.  ఇక్కడ ఒక విషయం గమనించాలి.  రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే, ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఆంధ్ర ప్రజలకి తెలంగాణ నాయకులందరినీ ప్రతినాయకులుగా పరిచయం చేసిన మన ప్రస్తుత నాయకులు మళ్ళీ వాళ్ళని ఆలింగనం చేసుకుంటే కొంచెం అర్ధమవడానికి అర్ధం చేసుకోడానికి సమయం పట్టదా.  జగన్ ది స్వచ్ఛమైన బాల ప్రేమ, కాని కేసిఆర్ ప్రేమ ఏమో చెప్పలేం.  వీరిద్దరి కలయిక లోగుట్టు పెరుమాళ్ళకెరుక. ఇది జగన్ పాలనలో విశేషంగా చెప్పుకోదగ్గ విషయం.

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత.  అక్రమ కట్టడాలను అరికడుతూ ప్రభుత్వం తీసుకున్న చర్య ఇది.  కాని అటు మీడియా ఇటు ప్రజలూ చాలావరకూ బాహాటంగానే ఇది ప్రతీకార చర్యే అని అనుకుంటున్నారన్నది నిర్వివాదాంశం.  కారణమేదైనా అవినీతిని అంతమెందిచడంలో జగన్ తీసుకున్న మెరుపు నిర్ణయమిది.  ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా పక్కా ఆధారాలతో అవినీతి కట్టడాలను నిరోధించాలనే సంకల్పంతో ప్రజావేదికే కాదు చుట్టు పక్కలున్న కట్టడాలను సైతం కూల్చివేతకు ఆదేశాలిచ్చిన జగన్.  జగన్ నెల రోజుల పాలనా వ్యవధిలో చంద్రబాబునాయుడుకి మిగిల్చిన విశేషమైన అవశేషమిది.

ఆఖరిది అంతగా ప్రాముఖ్యతలేనిది అధికారుల బదిలీలు మరియు పాత ప్రభుత్వ లెక్కల పంచానామా.  మామూలుగా కొత్తగా ఏర్పాటైన ఏ ప్రభుత్వమైనా తీసుకునే సత్వర చర్య ఇది. కాకపోతే ఇక్కడ జగన్ విశేషమేమిటంటే కొంచెం ఘాటుగా నిర్ణయాలు తీసుకోవడం .  ఏదేమైనప్పటికీ పైన చెప్పుకున్న మూడు విషయ అవశేషాలు ప్రభుత్వపాలనా పరంగా గొప్పఅంశాలు.  ప్రతిపక్షపరంగా యధావిధిగా గగ్గోలు రామాయణం.  కాని ప్రజాపరంగా జగన్ గారి నెల పాలన మాత్రం మాంచి మసాలా లాంటి ఈస్ట్ మెన్ కలర్ సినిమా.

‘ఆరు నెలలు సమయమిద్దాం కొత్త ప్రభుత్వం సర్దుకోడానికి’ అన్న చంద్రబాబునాయుడు నెల రోజుల వ్యవధిలోనే తన నిర్ణయం మార్చుకోవడం కొసమెరుపు.  నెల రోజుల్లోనే జగన్ ఇంత చేస్తే పూర్తి వ్యవధిలో ఇంకెన్ని మెరుపులుంటాయో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: