కాపుల సంక్షేమానికి మరే ప్రభుత్వమూ ఇవ్వనంత అధిక ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశమే. కాపు కార్పొరేషన్‌, ప్రత్యేక రిజర్వేషన్లు, బీసీల్లో చేర్చడం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేశాం. అయినా సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడంతో ఎన్నికల్లో ఓటమిపాలయ్యాం.. అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు కాపు సామాజికవర్గ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

 

తెదేపా ఆవిర్భావం నుంచి కాపులు అండగా ఉన్నప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. ఈ ఎన్నికల్లో వారు ఎందుకు దూరమయ్యారో? కారణాలేమిటో గుర్తించాలని కోరారు. తెదేపా కాపు సామాజికవర్గ నాయకులు సోమవారం సాయంత్రం చంద్రబాబుతో ఉండవల్లిలోని నివాసంలో సమావేశమయ్యారు. ఇటీవల కాకినాడలో కాపు నేతలంతా భేటీ కావడం, ఆ సందర్భంగా వేర్వేరు ఊహాగానాలు తలెత్తిన నేపథ్యంలో  ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

జనసేనతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. పార్టీకి కీలకమైన అంతర్గత విభాగం (బ్యాక్‌ ఆఫీస్‌) పనితీరు పేలవంగా ఉందని నాయకులు పేర్కొన్నారు. కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన లోకేశ్‌, నారాయణ వంటివారు ఎన్నికల్లో పోటీకి దిగడంతో అక్కడ శూన్యత ఏర్పడిందని తెలిపారు. ఆర్థిక వనరుల కొరత బాగా దెబ్బ తీసిందని వివరించారు.

 

రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తుల పాత్ర విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పారు. మొత్తంగా కాపులకు నమ్మకం కలిగించేలా నాయకత్వాన్ని ప్రోత్సహించలేదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరైన నాయకులకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పారు. నేతల సూచనలన్నీ సావధానంగా ఆలకించిన చంద్రబాబు.. ‘మీరు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటా. లోపాలు సరిదిద్దుకుందాం’ అని హామీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: