పట్టణాల్లో పేదలకు నిర్మిస్తున్న గృహాల నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని,  ఈ వ్యవహారంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. చదరపు అడుగుకు రూ.1,100 అయ్యే ఖర్చుని ‘షేర్‌వాల్‌ టెక్నాలజీ’ పేరుతో రూ.2,200-2,300కి పెంచి దోచేశారని, ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సింది పోయి రూ.3 లక్షల భారం వేశారని పేర్కొన్నారు.

 

‘రివర్స్‌ టెండరింగ్‌లో ఎక్కువ మంది పాల్గొనేలా అర్హతలను తగ్గిద్దాం. పునాది స్థాయి దాటని, మంజూరైనా పనులు ప్రారంభంకాని ఫ్లాట్లపై ఎలాంటి టెక్నాలజీనైనా అనుమతించండి. ఎంత ఆదా చేయగలమో అనేది ఆలోచించాలి. నిర్మాణాల నాణ్యతలో, సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దు. ప్రస్తుతం నిర్మాణంలోని ఇళ్లు అత్యవసరంగా పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు.

 

సచివాలయంలో మంగళవారం ఆయన పట్టణ, గ్రామీణ గృహనిర్మాణాలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్లను వేధించడం తమ  ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. 2011లో నిర్వహించిన సర్వేలో ఇళ్లులేని పేదల సంఖ్యను తక్కువగా చూపటంతో కేంద్రం నుంచి రావలసిన నిధులు తగ్గాయని, పునః సర్వే కోసం ప్రధానికి లేఖ రాద్దాం అని చెప్పారు.

 

పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపడదాం. లబ్దిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదు. గ్రామ వాలంటీర్లు పారదర్శకంగా వ్యవహరించాలి. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇళ్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతం.. అని ముఖ్యమంత్రి వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: