గురువారం, ఆంధ్రా అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..తాజా ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ ల మధ్య తెలంగాణ ప్రాజెక్టుల అంశం సభను కుదిపేసింది. చర్చంతా దీనిపైనే సాగుతూ, అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.

కాళేశ్వరం , గోదావరి,క్రిష్ణా పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలో వాడి వేడిగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రాంతం నుంచి ఏపీకి నీళ్లు తెస్తామని, తనకున్న సత్సంబంధాల వల్లనే ఇది సాధ్యమైందని, తెలంగాణ భూమి మీదుగా గోదావరి జలాలను తరలించి..ఏపీలోని క్రిష్ణా ఆయకట్టును స్థిరీకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

దీనిపై చంద్రబాబు అభ్యంతరం తెలుపుతూ తెలంగాణ నుంచి ఒకవేళ నీళ్లు రాకపోతే ఏం చేస్తారంటూ ఆవేశంగా ప్రశ్నించారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ, జగన్‌. ఏపీకి కేసీఆర్‌ సహకరిస్తున్నారు. తెలంగాణ హద్దుల్లో ఉన్న గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తెచ్చుకుని ..రాయలసీమ, క్రిష్ణా ఆయకట్టుకు ఇస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత బాధ అంటూ, గోదావరి నది గురించి ప్రతిపక్షానికి క్లాసు తీసుకున్నారు జగన్‌.

'' గోదావరి నదికి నాలుగు పాయలుంటే, నాసిక్‌ నుంచి వచ్చే పాయ ఏనాడో ఎండి పోయిందని అది తెలంగాణకు చేరడం లేదన్నారు. రెండో పాయ ప్రాణహితలో 36 శాతం, మూడో పాయ ఇంద్రావతిలో 26 శాతంగా మొత్తం 60 శాతం గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతానికి ఉన్నాయని జగన్‌ వెల్లడించారు. అయితే ఏపీకి శబరి పాయ ద్వారా కేవలం 11 శాతం అంటే 500 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని ..ఈ సమయంలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న తెలంగాణ ..దిగువకు నీటిని వదిలితే తప్పా... '' అని ముఖ్యమంత్రి వివరించారు.

ఇదంతా వివరిస్తున్నపుడు టీడీపీ సభ్యులు ఆసక్తిగా వినడం విశేషం. ఇలాంటి నేపథ్యంలో మనకు కావాల్సింది గొడవలు కాదు. రాష్ట్రాల మధ్య సఖ్యత.. సీఎంల మధ్య సత్సంబంధాలు ఉంటే, కలిసి పనిచేసే గుణం ఉంటే ఏదైనా ప్రగతి సాధ్యమని, మనకు సాయం చేయడానికి కేసీఆర్‌ ఒక అడుగు ముందుకు వేస్తే తప్పేంటని జగన్‌, చంద్రబాబును ప్రశ్నించారు.

కొన్ని మంచి విషయాలున్నప్పటికీ ,మొత్తంగా అసెంబ్లీ ఈ అంశాలపై మాటల యుద్ధం కొనసాగించ కుండా రాష్ట్రంలో నెలకొన్న కరవు మీద, రైతాంగం సమస్యల మీద సమరం చేస్తే సమంజసంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: