తొలి సేంద్రియ గ్రామం 'కొండబారిడి'

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు దగ్గరలో మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడి పొలాల్లో అడుగుపెడితే, భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిత్రకీటకాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు,పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టిపరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది.

భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామ సంఘాలుగా ఏర్పడి, ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పంటలకు స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పురుగుమందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా, ఆంధ్ర ప్రదేశ్‌లో తొలి సేంద్రియ గ్రామంగా గుర్తింపు తెచ్చారు. కొండల మధ్య కొలువైన కుగ్రామం విజయనగం జిల్లా, కురుపాం మండలంలో పెదకొండ,తోటకొండ,తివ్వకొండల మధ్య ఉన్నదే కొండబారిడి.

అక్కడి 70 కుటుంబాలలో, 63 మంది రైతులు. ఒకపుడు వీరికి రసాయన ఎరువులంటే తెలీదు కానీ, అధిక దిగుబడుల కోసం,మైదాన ప్రాంత రైతుల సాగును చూసి, వారి ప్రభావంతో యూరియా,డిఎపీ,సూపర్‌ పాస్ఫేట్‌ ,పొటాష్‌ వంట రసాయన ఎరువులకు అలవాటు పడి అప్పుల పాలవ్వసాగారు. ఈ నేపథ్యంలో వారి మధ్యకు 'జట్టు ట్రస్ట్‌' వచ్చి, పెట్టుబడి లేని  వ్యవసాయాన్ని పరిచయం చేసింది. వారంతా సంఘాలుగా ఏర్పడి 'జట్టు ట్రస్టు' తో జతకట్టి, శిక్షణ తీసుకున్నారు.  95 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టారు. గతంలో కంటే, 40 శాతం ఎక్కువ దిగుబడి సాధించారు. 

ముందుగా కొంత భూమిలో ప్రయోగాత్మకంగా, వారు తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఉపయోగించి, సాగు చేశారు. మంచి ఫలితాలు రావడంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు కూడా ప్రకతి వ్యవసాయంలో పాలుపంచుకున్నారు. గ్రామంలో 30 మంది మహిళలు సేంద్రియ ఎరువులను తమ పొలాల కోసం తయారు చేసుకుంటున్నారు. పశువుల పేడలో గోమూత్రం కలిపి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఈ ఘనామతాన్ని చివరి దుక్కిలో, పంట కాపు దశలో వినియోగిస్తారు. రాగులు, సజ్జలు వంటి పంటల సాగులో  ప్రకృతి వ్యవసాయ విధానాలే అనుసరిస్తున్నారు.

బ్యాక్‌ టు నేచర్‌...

'మా ఊళ్లో పెద్దలకు బీపీ, షుగరు లాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజుల్లో వారు చేసిన శారీరక శ్రమ, తిన్న ఆహారమే. అలాంటి వారి మధ్యకు సస్య విస్లవం పేరున రసాయన ఎరువులు ప్రవేశించి నేలలోని సారం పోగొట్టుతున్నాయి. ఆ ప్రమాదం నుండి కాపాడడానికే, సేంద్రియ సాగు వైపు మళ్లించాం.  విత్తనాల ఉత్పత్తి, సాగు పద్ధతిలో రైతులకు అవగాహన కల్పించాలి. జట్టు ట్రస్టు ప్రధాన ఉద్దేశాలు ఇవే. తమ ఊరిని మార్చడానికి, గిరిజనులు ముందుకొచ్చి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఇది.'' అంటారు, జట్టు ట్రస్టు వ్వవస్దాపకుడు, డి.పారినాయుడు. ఈ సేంద్రియ గ్రామం పై ఆసక్తికరంగా తీసిన వీడియోను ఈ లింక్‌లో చూడండి...!!  https://www.youtube.com/watch?v=oGVOrwu7cLE

మరింత సమాచారం తెలుసుకోండి: