మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయ‌కుడు అనే సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో చేసే కార్య‌క్ర‌మాల్లో త‌ల‌సానికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త క‌ట్ట‌బెట్టారు. అయితే, ఇంత బ‌ల‌వంతుడైన ఆయ‌న‌కు ఊహించ‌ని స‌మ‌స్య వ‌చ్చింది. బోనాల వేడుక సందర్భంగా ఉత్సాహంతో డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, మంత్రి మద్యం సేవించి డ్యాన్స్ చేశారని కొందరు నెటిజెన్ల సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు.


బోనాల పండగ సందర్భంగా మంత్రి తలసాని తన అనుచరులతో కలిసి సరదాగా చేసిన డ్యాన్స్‌కు గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పాపులరైన ‘మందుబాబులం’ పాటను జతచేసి ఓ వ్యక్తి టిక్ టాక్ వీడియో చేసినట్లు తెలుస్తోంది. మందుబాబులం.. మేం మందుబాబులం’ అంటూ సాగుతున్న పాటకు మంత్రి లయబద్ధంగా స్టెప్పులు వేసినట్లుగా వీడియోలో ఉంది.అయితే, ఈ పాట‌పై త‌ల‌సాని మండిప‌డ్డారు. అసలు తనకు మందు అలవాటు లేదని… ప్రతి ఏడాది బోనాలకు డ్యాన్స్ చేస్తానని మంత్రి తలసాని తెలిపారు. ఆడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తలసాని తప్పెట వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్స్ చేయగా, ‘మందుబాబులం మేము మందుబాబులం’ అనే పాటకు డ్యాన్స్ చేసినట్టుగా ఓ టిక్ టాక్ వీడియో సందడి చేస్తోందని పేర్కొంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు తెలిపారు.


మంత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోష‌ల్ మీడియా  కొత్త త‌ర‌హా దూకుడు నేప‌థ్యంలో నేత‌లు సైతం చిత్ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. దానికి తాజా ఉదాహ‌ర‌ణ మంత్రి త‌ల‌సాని డ్యాన్సును మార్ఫింగ్ చేయ‌డ‌మ‌ని ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌ముఖుల సంబురాలు సైతం కొంద‌రి తిక్క చేష్ట‌ల‌కు చిరునామాగా మారాయంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: