ప్రతి ఉద్యోగీ జీవిత చరమాంకంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. ఆ వయస్సులో వచ్చి ఆరోగ్య సమస్యలకు ఆర్థిక సమస్యలు కూడా తోడైతే.. జీవితం నరక ప్రాయమే. అందుకే రిటైర్ అయిన ఉద్యోగులకు గతంలో ప్రభుత్వాలు పెన్షన్ ఇచ్చేవి. కానీ ఇది భారంగా మారుతుందని భావించిన ప్రభుత్వాలు కొన్నేళ్లుగా పెన్షన్ కు గుడ్ బై చెప్పేశాయి.


కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ అంటూ కొత్త విధానం తీసుకొచ్చాయి. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగ వర్గాలు పోరాడుతున్నాయి. కానీ అది సాధ్యపడటం లేదు. గత ఎన్నికల ముందు ఈ అంశంపై జగన్ హామీ ఇచ్చాడు.. సీపీఎస్ వ్యవస్థను రద్దు చేసి పాత పెన్షన్ వ్యవస్థ తెస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు జగన్ ఆ హామీని అమలు చేసేందుకు నడుంబిగిస్తున్నాడు.


సీపీఎస్ రద్దు దిశగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీపీఎస్ రద్దు విషయంలో ఎదురయ్యే అవరోధాలేమిటి? వీటిని ఎలా అధిగమించాలి? అనే అంశాలపై ఆలోచిస్తోంది. ఇందుకోసం రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్‌ ఠక్కర్‌ అధ్యక్షతన గత సర్కారు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.


పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలంటే రాష్ట్ర ఖజానాపై ఏటా ఎంత అదనపు భారం పడుతుంది? సీపీఎస్‌ రద్దు చేయకుండా, ఉద్యోగులకు నష్టం జరగకుండా చూడాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో కూడా ఠక్కర్ కమిటీ కూలంకషంగా వివరించింది. సీఎం మాత్రం మొదటి దానికే మొగ్గు చూపుతున్నారు. ఇచ్చిన మాటను యథాతథంగా అమలుచేసేందుకు పట్టుబడుతున్నారు. ఈ హామీని నిజంగా అమలుచేస్తే జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: