'' మేడిగడ్డ నుంచి అన్నారం,అక్కడి నుంచి సుందిళ్ల బాహుబలి పంపుల ద్వారా గోదారి నీళ్లను ఎత్తిపోస్తున్నారు కదా, ఆ నీటిని ఏం చేస్తారు ...?''
నిన్న ఓ దినపత్రిక ఎడిటోరియల్‌ మీటింగ్‌లో ఓ సబ్‌ ఎడిటర్‌ అడిగిన ప్రశ్న. ఎడిటర్‌తో సహా అందరే బుర్రలు పట్టుకున్నారు.
జవాబు కోసం ఇతర మీడియాలో ఉన్న జర్నలిస్టులకు ఈ ప్రశ్న వాట్సాప్‌లో చేరిపోయింది.


మాకు అందిన ఇదే ప్రశ్నను ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ని అడిగినపుడు ఆయనిలా అన్నారు.
'' ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టం ఎందుకంటే..? ఆ నీరు ఎల్లంపల్లికి చేరి, అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు, అక్కడి నుంచి మిగతా రిజర్వాయర్లలోకి చేరి, ఆయకట్టుకు చేరాలి. కానీ, అసలు ఎల్లంపల్లి దాకా పోకుండానే ఇలా ఎత్తిపోసుకున్న నీటిని గేట్లు వదిలి గోదావరి నదీప్రవాహంలోకి విడిచిపెట్టేస్తున్నారు. దీని వల్ల ఉపయోగం లేదు. ఒక వేళ ఇపుడు ఎత్తిపోస్తున్న ఆ నీటిని ఎల్లంపల్లికి, అక్కడి నుంచి మిడ్‌ మానేరు దాకా నీటిని చేర్చినప్పటికీ అక్కడి నుంచి రైతుల పొలాల్లోకి పారడానికి నీటిని తీసుకెళ్లే కాలువలు, ఆ రిజర్వాయర్ల పనులు పూర్తి కాలేదుకదా ? ఇపుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి టీఎంసీల కొద్దీ నీటిని ఎత్తిపోయకుండా ఉండాల్సింది? జస్ట్‌ పంపులను ట్రయల్‌ రన్‌ చేసి చూస్తే సరిపోయేది...'' అని ఆయన విడమర్చి చెప్పారు.


 ఎత్తిదింపుడు పథకమా?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లారని కేంద్ర మాజీ మంత్రి, బండారు దత్తాత్రేయ , హైదరాబాద్‌లో ఆదివారం మీడియా సమావేశంలో దుయ్యబట్టారు.
'' కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తిదింపుడు పథకంగా మారిందని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరైన సాంకేతికత, ముందు చూపు లేకుండా నిర్మించిందన్నారు. మానేరుకు వరద వస్తే అన్నారం బ్యారేజీ నుంచి 3 టీఎంసీల నీటిని వృధా గా వదిలేయడం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు.. ఎత్తిదించే పథకం అనిపిస్తోంది. సాంకేతిక లోపం కారణంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి నీళ్లు తిరిగి కాళేశ్వరంలోకే వస్తున్నాయని '' అయన చెప్పారు. దీనివల్ల దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టానికి కేసీఆర్‌ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు.

వరదొస్తే అంతా వృధా...
'' జూన్‌, జూలైలో తగినన్ని వర్షాలు రాకపోయినా, ఆగస్టులో వరదలొస్తే ఇప్పుడు ఎత్తిపోసిన నీరంతా వృధా అవుతుంది కదా..
ప్రభుత్వం అదెందుకు ఆలోచించలేదు..? '' అని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇటీవల ప్రశ్నించారు. మంత్రులు, ఇంజినీర్లు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: