( కశ్మీర్‌లో రాజకీయ పరిణామాల పై దేశ వ్యాప్తంగా విద్యావంతులు,రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతోంది. ప్రముఖ సామాజిక విశ్లేషకులు సిద్ధార్ధి సుభాష్‌ చంద్ర గారు కశ్మీర్‌ గురించి కొన్ని వాస్తవాలను ఇలా వ్యక్తం చేశారు .)

1.ఎన్నడూ కశ్మీరీలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ఐదేళ్లూ పూర్తిగా బ్రతికి బట్టకట్టనీయలేదు.

2.ఎన్నికలు జరిగితే ఈ దేశంలోని అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రంలో నమోదు కాని ఓటింగ్ శాతం ఎంతో అంతమాత్రమే అక్కడ ఓటింగ్ నమోదవుతుంది. మొన్న ఎన్నికల్లో దాని శాతం కొన్నిచోట్ల 18% కూడా వుంది.

3. చరిత్రలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కన్నా ఢిల్లీ విధించిన రాష్ట్రపతి పాలనే ఎక్కువ.

4.కశ్మీర్ ఎవరి ఆధిపత్యం లేని స్వేచ్చాస్వతంత్రాల్ని కోరుతుంది. పాకిస్తాన్, ఇండియాలలో కలవాల్సి వస్తే అది ఇండియానే కోరుకుంటుంది తప్ప పాకిస్తాన్ ని కాదు.

5.ఛాలామంది కశ్మీర్ స్వంత్రతని పాకిస్తాన్ అనుకూలతగా, పాకిస్తాన్లో చేరేందుకు తహతహలాడే ప్రాంతంగా దాదాపు ప్రతి భారతీయుడు తప్పుగా భావిస్తాడు.

6. ఎన్నడూ కశ్మీర్ ముఖం చూడనివాడూ, అక్కడ అంగుళం స్థలం సొంతం లేనివాడూ, అసలు ఆ ప్రాంతపు అసెంబ్లీ ఎక్కడుందో తెలియనివాడూ, ఒక్క పార్టీ పేరుతెలియని వాడూ.. చివరాఖరికి ఆ ప్రాంతం పేరు సిలబల్ ప్రకారం రాయడానికేకాదు, పలకడానికి కూడా రాని ప్రతివోడూ ఆ ప్రాంతం తన సొత్తంటాడు. తీర్పులు చెబుతాడు.

7.కశ్మీర్ ఇండియాలో విడదీయలేని భాగం అనుకుంటారు, ఆమాటకొస్తే ఏప్రాంతమూ అలా అనలేం. రాజ్యాంగం స్పష్టంగా తన మొట్టమొదటి వాక్యంలో స్పష్టంగా చెబుతుంది, "రాష్ట్రాల కలయిక" అని.

8.కశ్మీర్ స్వతంత్రం నాటికి ఇండియాలో భాగం కాదు. స్వతంత్రం వచ్చాక ఇండియాలో చేర్చుకున్న కశ్మీర్ కి ప్రత్యేక జెండా, రాజ్యాంగం వున్నాయని గుర్తించాలి.

9.కశ్మీర్ మాత్రమే కాదు, ఇండియాలో చాలా ప్రాంతాలను కొన్ని ఒప్పందాలు, హామీలనిచ్చి ఇండియాలో చేర్చి తర్వాత వాటిని తుంగలో తొక్కడమైనది, సిక్కిం అందుకు పెద్ద ఉదాహరణ.

10.అసలు జాతి, భారతీయత, దేశం అనేది ఆధునిక భావన. అది యూరోప్ లో జాతి రాజ్యాలు (నేషియో- నేషన్ - నేషనల్..) అనే ఒక ప్రాంతంలోని భిన్న తెగల్ని అదుపులో పెట్టుకోవడంకోసం పాలకులు సృష్టించిన పదం. అది బ్రిటిష్ వారి కాలంలో ఈ దేశంలో స్వతంత్ర సాధనకు ప్రచారం చేశారు. నిజానికి ఎప్పుడూ ఈ దేశం ఇలా కలిసి లేదు.

11.తెలుగుతల్లి, తెలంగాణా చెల్లి, భరతమాత పెద్దమ్మ.. అంటూ మనం పాడితే రష్యాలాంటి దేశాలు రష్యా నాన్న, చెచెన్యా బాబాయ్ అంటూ మగవారి వారసత్వాన్ని కవిగాయకులు కవితలల్లారు తప్ప అది వాస్తవం కాదు.

12.హురియత్ కాంఫరెన్స్ వంటి సంస్థలనుండి జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటి రాజకీయేతర విభాగాలు కశ్మీర్లో వున్నాయి. యాసిన్ మాలిక్, అబ్దుల్ గిలానీ భట్ వంటి నిబద్దత కలిగిన నాయకులు అక్కడ వున్నారు. వీళ్లని డిల్లీ ముప్పు తిప్పలు పెడుతుంది, ప్రతి చర్యకి అరెస్టులు చేస్తుంది. నిజానికిది కావాలని జరిపే కుట్ర. ప్రజాస్వామ్యబద్దంగా వుండేవాళ్లని వేధిస్తే, నిరాశ నిస్పృహల్లోని యువత తీవ్రవాదం వైపు మొగ్గితే అప్పుడు సైన్యం సుళువుగా వాళ్లని డీల్ చేయవచ్చనేది కుతంత్రం. దీనికి ఆజ్యం పోయడానికి దాయాది దేశంలోని తీవ్రవాద ముఠాలు సిద్దంగా వుంటాయి. వాస్తవానికి సగటు కశ్మీరీ శాంతి ప్రేమికుడని గుర్తించాలి.

13.మనం రాజ్యాల్ని విలీనం చేసుకునేటప్పడు ద్వంద్వనీతి పాటించాం. పాలకులు ఇస్లాం ఐతే పాలితులు హిందువులు కాబట్టి ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలమాట వినాలి, ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయసేకరణ) జరపాలి అంటూ హైదరాబాద్, జునాగడ్ వంటి ప్రాంతాలని కలిపేసుకున్నాం. కశ్మీర్ లో ఇందుకు విరుద్దంగా రాజు హిందువు, పాలితులు ఇస్లాం అయినప్పుడు దొడ్డిదారిన కలుపుకున్నం. ఐకరాజ్యసమితి వంటి అంతర్జాయతీయ మధ్యవర్తిత్వం వద్దన్నాం, ప్రజాభిప్రాయసేకరణ తొక్కిపట్టాం, గౌరవంగా చూసుకుంటామన్నాం, ఇప్పుడు పూర్తిగా అణగదొక్కాం.

14.దాదాపు ప్రతి కుటుంబం ఒక్క ఇంటిమనిషినైనా కోల్పోయింది. నిరంతరం ఐతే పోలీసులు, కాకపోతే సైన్యం కనుసన్నల్లో కశ్మీర్ బ్రతుకుతోంది. ప్రతి ఏడుగురు పౌరులకు ఒక సైనికుడు లెక్కన అత్యంత నిర్బంధంలో బ్రతుకుకున్న ప్రాంతం కశ్మీర్. అక్కడ పత్రికలు, మీడియా, ఇంటర్నెట్, కేబుల్ టీవీ, రేడియో అన్నింటిమీదా నియంత్రణ వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం రాష్ట్రం ఒక జైలులాగా వుంటుంది, కశ్మీరీలు అందులో యుద్ద ఖైదీలు. వారి దుస్తితిమీద స్పందించని అంతర్జాతీయ సంస్థలు ఏవీలేవు, రాయని తెలుగు హక్కుల కార్యకర్త ఎవరూ లేరు.

15.కశ్మీర్లో నిర్బంధాలు పెరిగినప్పుడు సహజంగా ప్రతిస్పందనగా వచ్చే ఉద్యమాలను అల్లర్లు అని పిలవడం పరిపాటి. అలాంటి అల్లర్లలో అప్పటిదాకా అధికారం అనుభవించిన ప్రత్యేక ఒక కులానికి చెందిన వారు డిల్లీ పరిసరప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలతో సెటిలయ్యారు. వారినే ముద్దుగా కశ్మీరీ పండిట్లని పిలిచి, అంతర్జాతీయంగా ప్రచారానికి వాడారు. వీరి సంఖ్య వారిపట్ల ప్రేమని బట్టి లక్షలనుండి కోట్లకు పెరుగుతుంది, అసలు ప్రభుత్వ అధికారిక లెక్కలతో సంబంధంలేకుండా, అసలు ఇటువంటి వలసలు ఈ దేశంలో ఎక్కడా జరగనట్లు, అసలు అన్నికులాలు అక్కడుండంగా ఒకే కులం ఎందుకు వలసవచ్చిందో తెలియకుండా, ఇలా వలసవచ్చిన ఒక్క కుటుంబమైనా దుర్బరంగా ఎందుకు కనిపించదో అర్థంకాకుండా! ఆసలు వీళ్లకన్నా ముందు రాజా హరిసింగ్ ఇన్స్ట్రుమెంత్ ఆఫ్ యాక్షషన్ మీద సంతకం పెట్టగానే కశ్మీర్ వదలి పాకిస్తాన్ వలసవెళ్లిన వాళ్లగురించి చిత్రంగా ఎవరూ మాట్లాడరు!

16.దేశ రక్షణ పేరుతో కశ్మీరుమీద నియంత్రణ కోరుతున్న వాళ్ళే అప్పట్లో పాకిస్తాన్ ని చీల్చి బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేశారు, ముక్తిబాహిని వంటి ప్రైవేట్ సైన్యాల్ని మనం ఏర్పాటు చేసి. ఇటు కశ్మీర్ విషయంలో అటుపక్క బంగ్లాదేశ్ విషయంలో మనం ఆడిన ఈ నాటకమే పాకిస్తాన్ పక్కన చిరకాల శత్రువుగా తీర్చిదిద్దింది. తుపాకీ కణతకు గురిపెట్టి సంతకాలు చేయించిన మనం ఆ శాంతిని అనుభవించలేమని గుర్తించాలి. పక్కన ఈ దేశానికి నాలుగురెట్లు పెద్దదైన ఆర్థిక బలిమిగల చైనాని ఎదుర్కోలేం, దానికి అమెరికా సహాయం కావాలి, దానికి మనం తినే తిండి నుండి వాడే ఆయుధాలవరకు మార్కెట్ కావాలి.

17.అరబ్బులని వారిదేశం నుండి తరిమేసి చంపుతోన్న ఇజ్రాయేల్, రెండ్ ఇండియన్స్ ని వేటాడి చంపిన అమెరికా వంటి దేశాలు కశ్మీరీలను తరిమి చంపడానికి మద్దతుదార్లు. నిజానికి ఈ దేశాలకు కశ్మీర్ సమస్యను కాలుతూ వుంచడం అవసరం, అప్పుడే వారి ఆయుధాలకు గిరాకీ.

18.ఇది అంతంకాదు. జస్ట్ ఆరంభం. మొన్నటిదాక అంతర్జాతీయం ఇస్లాం తీవ్రవాదానికి ఇండియా టార్గెట్ కాదు. ఇప్పటినుండి అసలుకథ మొదలవుతుంది. శాంతిప్రియుల్ని, చదువుకున్నవారిని, ప్రజాబిప్రాయం గలవారిని, ముఖ్యంగా సామాన్య ప్రజల గొంతునొక్కి నిర్బంధం చేశాక, వీళ్లెవరూ కాని చదువురాని, యుద్ద పిపాసులు, కిరాయి సైన్యాలూ, మత ఛాందసవాదులూ పాకిస్తాన్ సరిహద్దుగుండా అంతర్జాతీయ తీవ్రవాదంలో భాగంగా దేశంలోకి చొరబడతారు. ఇంతవరకు తటస్థంగా నిలబడిన అక్కడి జనం వారికి మద్దతుపలకవచ్చు, మరిన్ని వేధింపులు, అకృత్యాలూ పెరగవచ్చు, ఇప్పటికే పరిస్తితి నియంత్రించలేని సరిహద్దు సైన్యం అన్ని కష్టాలనీ భరించాల్సి రావచ్చు. ఈమారు ఎన్నికలకంతా యుద్దం దేశానికి విస్తరించవచ్చు.

19.కేవలం కోస్తా తీర ప్రాంతాల్లోనే అంబానీలు ఆయిల్ తోడుకోనక్కరలేదు, కేవలం ఈశాన్య రాష్ట్రాల్లోనే టాటాలు టితోటలు పెంచుకోనక్కర్లేదు, ఝార్ఖండ్ గనుల్లోనే జిందాల్, మిట్టల్ లు, ఇంకా చిన్నా చితక రియల్ ఎస్టేట్ కంపెనీలు, టూరిస్ట్ రిసార్ట్ కంపెనీలు పండ్లతోటలు, చెరువులూ, భూములూ చౌకగా కొనేసి కశ్మీర్ ని గుప్పిట పెట్టుకుని నమిలి తినేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతున్నారని మరువరాదు.

20.హక్కులనేవి నాగరికమైనవి, అభ్యుదయమైనవి. వాటిని మతం, దేశం అనే పదాలద్వారా రాజ్యం అదుపులో పెట్టుకుని అణచివేస్తుంది. వీటిని దాటి ఆలోచించినప్పుడే పంజాబ్ ఖలిస్తాన్ అంటూ విడిపోతానంటే, తమిళనాడు ద్రవిడస్తాన్ అంటూ విడిపోతే రాని ఆవేశం కశ్మీర్ స్వతంత్రం అంటే వస్తుంది. కారణం కశ్మీర్లో వుండేది మన మతం కాదు. ఇట్స్ సో సింపుల్.

  అనే మూర్కవాదనలూ వుంటాయి. వాళ్లకి అసలు మనిషి మనుగడ, సృష్టిక్రమమే అర్థంకాలేదని, ఈ దేశంలోని భిన్నత్వంలోని అందం, మాధుర్యం అర్థంకాలేదని అర్థం. అసలు అతడికి బ్రతుకే అర్థంకాలేదని అర్థం. ( cartoon by Subhani) 


మరింత సమాచారం తెలుసుకోండి: