కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విడగొట్టడం పై పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన వైఖరిని దేశవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దును, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని కాంగ్రెస్‌ పార్టీ బలంగా వ్యతిరేకించింది.
దీనిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు కాంగ్రెస్‌ నాయకులు సమర్ధించారు. ఆర్టికల్‌ 370 రద్దును హర్షిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జనార్దన్‌ ద్వివేది ఆలస్యమైనప్పటికీ చారిత్రక తప్పిందాన్ని సరిచేశారన్నారు.

2, జాతి సమగ్రతకోసం రద్దు అవసరమేనని మరో నాయకుడు దీపేందర్‌ హుడా అన్నారు. ఆర్టికల్‌ 370 అనేది ఉదారవాదులు, ఛాందసవాదుల మధ్య చర్చగా మారడం విచారకరమన్నారు. తను ఆ ఆర్టికల్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని చెబుతూ 'పార్టీలు తమ సైద్ధాంతిక ఆలోచనల్ని పక్కన పెట్టాలి. భారతదేశ సార్వభౌమత్వం, ఫెడరల్‌ తత్వం, జమ్మూ కశ్మీర్‌లో శాంతి నెలకొనడం, కశ్మీరీ యువతకు ఉద్యోగాలు, కశ్మీరీ పండిట్లకు న్యాయం జరగడంపై చర్చించాలి. రద్దు చర్య నోట్ల రద్దు కంటే కూడా మంచి ఫలితాన్నిస్తుందనుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశారు.

3, బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులకు విప్‌ జారీచేయమని పార్టీ కోరినందుకు నిరసనగా రాజ్యసభలో కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ భువనేశ్వర్‌ కలితా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ( cartoon by subhani )

4, కాంగ్రెస్‌ యువనేత, ఆ పార్టీ మాజీ ఎంపి జ్యోతిరాదిత్య సింధియా జమ్మూ , కశ్మీర్‌ విభజనకు మద్దతు పలికారు. ఆ రాష్ట్రానికి ప్రత్యేకాధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును కూడా స్వాగతించారు. ' జమ్మూ, కశ్మీర్‌, లడఖ్‌లపై చర్యను, దీన్ని భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడాన్ని నేను సమర్థిస్తున్నాను. రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ఉంటే బాగుండేది.అప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి కావు. అయినా ఇది దేశ ప్రయోజనాల కోసమే. నేను దీన్ని సమర్థిస్తున్నాను' అని సింధియా అంటారు.

5, ఆర్టికల్‌ 370 రద్దుపై సొంత పార్టీ వైఖరికి వ్యతిరేకంగా జనార్ధన్‌ ద్వివేదిలాంటి కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే గళం విప్పడం తెలిసిందే. 6, లోక్‌సభలో పార్టీ నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యపట్ల కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం చిరాకు పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 'ఈ సమస్య ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తుండగా జమ్మూకశ్మీర్‌ సమస్య అంతర్గత వ్యవహారమా, కాదా?' అని చౌదరి లోక్‌సభలో ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: