రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన పోరాటాల పురిటి గడ్డ.. అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 126మంది యోధులు నేలకొరిగిన కర్మభూమి.. అదే బైరాన్‌పల్లి. ఆ ఊరిలో అడుగుపెట్టగానే అమరుల స్థూపం అడుగడుగునా నాటి స్మృతులను గుర్తు చేస్తుంది. ఊరి మధ్యలో నాటి త్యాగాలకు సాక్షీభూతంగా నిలిచిన ఎతైన బురుజు పోరాటానికి గుర్తుగా చరిత్రలో అజరామరంగా నిలిచింది.

1947 ఆగస్టు15న దేశానికి స్వాతంత్య్రం సిద్దించి స్వేచ్ఛా వాయువులు పీల్చుతుండుగా నిజాం పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు స్వేచ్ఛా వాయువులకు నోచుకోక పోవడంతో పాటు రజాకార్ల ఆగాడాలకు బలై.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. గ్రామాల్లో రజాకార్లను ఎదుర్కొకునేందుకు ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి పొరుగున ఉన్న లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాలపై పడిన రజాకారు మూకలు దోపిడికి దిగారు. ఆయా గ్రామాల్లో దోచుకున్న సొత్తుతో బైరాన్‌పల్లి గ్రామం మీదుగా వెళ్తున్న రజాకార్లకు బైరాన్‌పల్లి గ్రామ రక్షణ దళ సభ్యులు అడ్డు తగిలారు. సొత్తును స్వాధీనపర్చుకోవడంతో పాటు ధిక్కార స్వరంతో రజాకార్లకు హెచ్చరికలు జారీ చేశారు.

దీంతో బైరాన్ పల్లి గ్రామంపై కక్షకట్టిన రజాకార్ల్లు రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడుల్లో 20మంది రజాకార్లు చనిపోయారు. దీంతో బైరాన్‌పల్లిని తిరుగుబాటు గ్రామంగా అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హసీం ప్రకటించి.. ఎప్పటికైనా బైరాన్‌పల్లిని మట్టుబెడతానని ప్రతీన బూనాడు. ఇలా కక్ష పెంచుకున్న రజాకార్లు ఏదో ఒకరోజు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని, గ్రామంలో ఎవరూ ఉండవద్దని గ్రామ రక్షణ దళానికి దళం పంపిన వర్తమానం అందలేదు. ఎప్పటిలాగే ధీమాతో గ్రామ నడిబోడ్డున వున్న బురుజును ప్రధాన రక్షణ కేంద్రంగా మలుచుకున్నారు.

అది 1948 ఆగస్టు 27.. సూర్యోదయం వేళ పల్లె నిదుర లేస్తోంది..అప్పటికే కొన్ని ఇళ్లలో రైతులు మేల్కొని లేగలను పాల కోసం వదులుతున్నారు. వేకువజామున తుపాకీ మోత, తోపుల పేలుళ్లు వినిపించాయి. వెను వెంటనే చావుకేకలు.. ఊరంత ఒక్కసారిగా ఉలిక్కి పడంది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడ్డారు గ్రామస్తులు. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు (రజాకార్లు) గతంలో గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చారు. సుమారు 1200 మంది బలగంతో పాటు భారీ మందు గుండు సామగ్రి, తుపాకులు, తోపులతో దొంగచాటున రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామంలోకి ప్రవేశించారు. రజాకార్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామ రక్షణ దళానికి చేరవేసే గ్రామ కాపరి విశ్వనాథ్‌భట్‌జోషి.. రజాకార్లకు దొరికిపోయాడు. ఉల్లెంగల వెంకటనర్సయ్య అనే గ్రామస్తుడిని రజాకార్లు పట్టుకోగా అతడు తప్పించుకోని పారిపోయి.. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారని పెద్దపెట్టున కేకలు వేశాడు. దీంతో గ్రామంలోని బురుజు మీదనున్న దళ కమాండర్ రాజిరెడ్డి అప్రమత్తమై, ప్రజలంతా తగిన రక్షణలో ఉండేందుకు నగారను మోగించాడు. నగారా శబ్దం విన్న బైరాన్‌పల్లి వీరులు నిద్ర లేచారు. బురుజుపై కాపలాగా వున్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకి గుండ్లకు బలయ్యారు.

బురుజుకు రక్షణ కరువైంది. గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టా రు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92మందిని వెతికి పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మ ఆటలను ఆడించారు. రజాకార్ల ఆగడాలను భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రజాకార్ల దాడిలో 25మంది రజాకార్లు చనిపోగా 126 మంది గ్రామస్తులు చనిపోయారని రికార్డుల్లో ఉంది. కానీ, ఆ సంఖ్య 150పైనే ఉంటుందని ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా రజాకార్లు బైరాన్‌పల్లితోపాటు కూటిగల్ గ్రామంపై పడి 30 మందిని పోట్టన పెట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: