తూర్పు గంగవరంలో కలకలానికి కారణం ఓ ఇంటి మేడ మీద నాగరత్నం అనే మహిళను దారుణంగా ఎవరో చంపేశారు. విషయం తెలిసిన వెంటనే ఊళ్లో వాళ్లంతా పరుగు పరుగున వచ్చేశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. అందరిలోనూ ఒకే ప్రశ్న నాగరత్నాన్ని చంపింది ఎవరు, ఎందుకు ఇది దొంగల పనా అయితే ఇంట్లో వాళ్లందరూ ఉండగా మేడపైకి తీసుకెళ్లి చంపడం సాధ్యమా, కనీసం ఆమె కేకలైన వేసి ఉండేది. అలా కూడా జరగలేదంటే తెలిసిన వాళ్లే నమ్మించి ఆమెను కడతేర్చారా. ఆ అవసరం ఎవరికుంటుంది, అప్పుడే అందరి దృష్టి పుల్లయ్య మీదకు వెళ్లింది. అతని కోసం ఆరా తీశారు. ఎక్కడా జాడ కనిపించలేదు. నాగరత్నం తల్లి ఏడుస్తూ చెప్పిన మాటలని విని అంతా ఒక్కసారిగా షాకయ్యారు.


ఎవరా పుల్లయ్య నాగరత్నం తల్లి అతని గురించి ఏం చెప్పింది. పుల్లయ్య మరెవరో కాదు నాగరత్నం భర్తనే వీళ్ళకు పదిహేనేళ్ల క్రితం పెళ్లైంది. అప్పట్లో కట్నకానుకలు లాంఛనాలన్నీ ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. బంధుమిత్రులంతా అభినందనలు తెలిపారు. పెళ్లయ్యాక నాగరత్నం భర్తతో కలిసి దొనకొండ మండలం పెద్దన్నపాలెంలోని అత్తగారింటికి వెళ్ళింది. నాలుగేళ్ళు కాపురం సాఫీగా సాగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు హ్యాపీ ఫ్యామిలీ. నాగరత్నం పుల్లయ్య ఎంతో అన్యోన్యంగా కలుసున్నారు. వృత్తిరీత్యా పుల్లయ్య మేస్త్రీ ఉపాధికోసం పెద్దన్నపాలెం నుంచి తూర్పు గంగవరానికి మకాం మర్చాడు. భార్యా పిల్లలతో అత్తగారింట్లోనే ఉండేవాడు. నాగరత్నం తల్లికి ముగ్గురు కూతుళ్లే.


వృద్ధ్యాప్యంలో చేదోడువాదోడుగా ఉంటాడని పుల్లయ్యను ఇల్లరికం అల్లుడిని చేసుకుంది. ఇక్కడ కూడా కాపురంలో ఎలాంటి గొడవలూ లేవు. భర్త పనిలోకి వెళ్తే నాగరత్నం ఇంట్లో ఉండి తల్లినీ పిల్లల్నీ చూసుకునేది. ఇంటి పనులన్నీ చేసుకునేది. మరోవైపు పుల్లయ్య ఊళ్ళోవాళ్ళందరితో కూడా బాగా కలిసిపోయాడు. అడపదడపా దోస్తులతో కలిసి మందుపార్టీ చేసుకునేవాడు. కాయకష్టం చేస్తున్నాడు కదా అప్పుడో ఇప్పుడో తాగితే తప్పేముందని సరిపెట్టుకుంది నాగరత్నం. కాని క్రమక్రమంగా మద్యానికి బానిసై పోవటం గమనించి మందు తాగ వద్దని అభ్యంతరం చెప్పడం మొదలు పెట్టింది. కానీ నాగరత్నం మాటల్నీ చెవిన పెట్టలేదు అతను.


పైగా భార్యను అనుమానించ సాగాడు. ఆమె ఎవరితో మాట్లాడిన సరే వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందని నానా గొడవ చేసేవాడు. ఊళ్లో వాళ్లు ఎవరైనా ఇంటికొచ్చి నాగరత్నంతో మాట్లాడితే చాలు అది చూసి రగిలిపోయేవాడు. లేనిపోని అనుమానాలతో మద్యానికి మరింత బానిసగా మారాడు. ఒక రోజు పీకల దాకా తాగి ఇంటికొచ్చాడు. ఎప్పటిలానే భార్య భోజనం పెట్టింది. అలా మేడమీదికెళ్ళి మాట్లాడుకుందామన్నాడు. అతని మనసులో పన్నాగాన్ని పసిగట్టలేదు నాగరత్నం. అతనితో కలిసి మేడ మీదకు వెళ్లింది. బాగానే మాట్లాడాడు. భర్త పక్కనే ఉన్నాడనే భరోసాతో ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. తరువాత ఏం జరిగింది.?


ఇల్లరికం అన్నమాటే కానీ పుల్లయ్య ఆ ఇంటికి పెద్దలా ఉండేవాడు. ఇంట్లో ఆ మర్యాద ఉండేది. ఊళ్ళో వాళ్ళ సైతం అతన్ని తమలో ఒకడిగా ఆదరించారు. పనికెళ్లడం ఇంటికి రావడం అపుడపుడూ స్నేహితులతో మందు పార్టీ చేసుకోవటం. రోజులలా సాగిపోయాయి. మందు తాగినప్పుడు చిందులేసే వాడే తప్ప మామూలుగా ఉన్నప్పుడు భార్యతో ప్రేమగానే ఉండేవాడు. కానీ ఆమె పసిగట్టలేక పోయింది అతని ఆ నవ్వుల వెనుక విషం ఉందని. ఆ రోజు కూడా పుల్లయ్య ఫుల్లుగా మందు తాగి వచ్చాడు. మామూలు గానే గొడవపడ్డాడు. మళ్లీ సైలెంట్ గా ప్రేమ కురిపించాడు. మేడ మీదకు తీసుకెళ్లాడు. ఆమె అతనిని నమ్మింది. అడుగులో అడుగేస్తూ ఇద్దరూ మేడ మీదకు చేరుకున్నారు


ఆరుబయట చల్లగాలి ఆమె నిద్రలోకి జారుకుంది. అంతే మైకంలో ఉన్నా సరే స్టడీ అన్నట్టుగా పిల్లిలా మెల్లగా లేచాడు పుల్లయ్య. అసలే అనుమానం ఆపై తాగిన మైకం విచక్షణ మరిచాడు, భార్యను నిద్రలేపాడు. నీతో మాట్లాడింది ఎవడు వాడు అంటూ గొడవపడ్డాడు. కోపంతో ఆమె తలను స్లాప్ కేసి బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది ఆమె. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న అతనిలో కనికరం లేకుండా పోయింది. మళ్లీ ఆమెపై దాడి చేశాడు. అంతే నాగరత్నం రక్తం మడుగులో శవమైపోయింది. మేడ దిగి ఇంట్లోకి వచ్చాడు పుల్లయ్య. నిదురబోతున్న అత్తను లేపాడు. నీ బిడ్డను చంపేశానంటూ కేకలు వేసి అక్కడి నుంచి పారిపోయాడు.


విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో స్పాట్ కు చేరుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. అల్లుడు పుల్లయ్యనే తన బిడ్డను చంపాడని నాగరత్నం తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు పుల్లయ్యను త్వరలోనే పట్టుకుంటామన్నారు సిఐ మహ్మద్ మోయిన్. అనుమానం పచ్చని కాపురంలో చిచ్చు రేపింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇద్దరు చిన్నారులకు అమ్మను, నాన్నను లేకుండా చేసింది. నాగరత్నం మర్డర్ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: