టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకుల్లో ఎంతగా విశ్వాసం నింపుతున్నా... ఆ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. తాజాగా మరో ముగ్గురు నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్‌ కుమార్‌ వైసీపీలో చేరబోతున్నారు. ఆయన గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.


తులసీరావు కుమార్తె, ఎలమంచిలి మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారట. త్వరలోనే వీరిద్దరూ జగన్‌ సమక్షంలో వీరు వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆనంద్ వైసీపీలో చేరడాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు బాగానే ప్రయత్నిస్తున్నారట. మాజీ మంత్రి అయ్యన్నతో రాయబారం నడిపించారట. అయితే అదేమీ వర్కవుట్ అయ్యేలా లేదు. ఆడారి ఆనంద్ వైసీపీలో చేరడం ఖాయమైపోయింది.


ఇక తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న కాపు నేత వరుపుల రాజా కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసారు. టీడీపీలో కాపులకు గుర్తింపు లేదని ఆయన ఆరోపిస్తున్నారు. రాజా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో కాపులకు సరైన గుర్తింపు లేదని, కమ్మ సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ, వారి చేతుల్లోనే పార్టీ నడుస్తోందని ఘాటుగా విమర్శించారు.


కాపుల రిజర్వేషన్‌పై జగన్‌ మొదటి నుంచీ ఒకే స్టాండ్‌తో ఉన్నారని చెప్పడం ద్వారా తాను ఆ పార్టీలో చేరబోతున్నట్టు సిగ్నల్ ఇచ్చేశారు వరుపుల రాజా. ఇక విశాఖ పట్నానికి చెందిన మరో నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బీజేపీలోకి వెళ్తున్నారట. ఈ మేరకు ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయట. టీడీపీలో భవిష్యత్ లేదని డిసైడైపోయిన నాయకులు అటు వైసీపీలోనో.. ఇటు బీజేపీలోనో చేరిపోతున్నారు. మరి ఈ వలసలకు చంద్రబాబు అడ్డుకట్ట వేసే పరిస్థితి కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: