ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీ జోరందుకుంది. ఇటీవలే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీ జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మందికి నియమాక పత్రాలు ఇచ్చేశారు. ఇక గ్రామ సచివాలయ పోస్టుల భర్తి ప్రక్రియ సాగుతోంది. ఇవి కాకుండా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి.


అయితే మరో భారీ రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని, చంద్రబాబు హయాంలోని బకాయిలన్నింటినీ తీర్చి విద్యార్థులకు మెస్, హాస్టల్‌ చార్జీల కింద రూ. 20 వేలు ఇవ్వబోతున్నామని ఆమె స్పష్టం చేశారు.


గిరిజన హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ, కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పోస్టులు, వర్కుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత కింద 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ మహిళలకు వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా రూ. 18,750 ఇవ్వబోతున్నామన్నారు.


అదే సమయంలో ఆమె పాత సర్కారు తీరుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులను చంద్రబాబు మోసం చేశారని పుష్పశ్రీవాణి మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజురీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిపులు చెల్లించని ఘనత చంద్రబాబుదని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల బిల్లులను కూడా చంద్రబాబు దారి మళ్లించారని, విద్యార్థులు ఆందోళన చెందడానికి చంద్రబాబు విధానాలే కారణమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: