వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడు నెలల కాలం పూర్తి చేసుకోక ముందే.. ప్రతిపక్ష తెలుగుదేశం ఆందోళనలతో హోరెత్తిస్తోంది. ఈ ప్రభుత్వం వేస్ట్ అంటూ ఊదరగొట్టేస్తోంది. చేతికాని పాలనతో జగన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లతో హోరెత్తిస్తున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సమస్యపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.


అయితే ఎందుకు తెలుగుదేశం ఇంత తొందరగా ఆందోళన బాట పట్టింది.. ప్రత్యేకించి ఇసుక సమస్యను ఎందుకు ఆయుధంగా తీసుకుంది.. దీనికి కారణం లేకపోలేదు.. సెప్టెంబర్ 5 నుంచి జగన్ సర్కారు కొత్తగా ఇసుక విధానం తీసుకురాబోతోంది. దాంతో ప్రస్తుతం నెలకొన్న ఇసుక సమస్యకు పరిష్కారం దొరినట్టవుతుంది. ఆ తరవాత తెలుగు దేశం నేతలు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకునే వారే ఉండరు. అందుకే కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగానే ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే రాష్టవ్యాప్తంగా ఇసుక సమస్యపై ధర్నాలు నిర్వహించారు.


అయితే ఇంత కష్టపడినా తెలుగుదేశానికి ఫలితం దక్కే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే జగన్ తీసుకురాబోతున్న ఇసుక విధానం ప్రస్తుత సమస్యలన్నింటికీ పరిష్కారంగా రాబోతోందట.. పారదర్శకంగా ఉండబోతోందట. అది అమల్లోకి వస్తే.. ఇబ్బందులకు తావుండదు. మరి ఇబ్బందులు లేనప్పుడు ఆందోళనకు ఆస్కారమేది.. ప్రతిపక్షానికి స్కోరింగ్ వచ్చే అవకాశమేది..? అందుకే ఏదో ఒక హడావిడి చేసినట్టు ఉంటుందని తెలుగుదేశం ఇసుక పోరాటం చేసింది.


కొసమెరుపు ఏమిటంటే... పాపం తెలుగుదేశం శ్రేణులు అంత కష్టపడి రాష్ట్రమంతటా నిరసనలు తెలిపినా.. చివరకు ఎల్లో మీడియాలోనూ అవి పెద్దగా హైలెట్ కాలేదు... ఎందుకంటే సాయంత్రానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనం అనే పెద్ద నిర్ణయం తీసుకుంది. దాంతో ఎల్లో మీడియా కూడా ఇసుక ధర్నా వార్తకు ప్రయారిటీ తగ్గించి.. బ్యాంకుల విలీనం వార్తలకు ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: