ఆధునిక యుగంలో చాలా రోగాలు సురక్షిత తాగునీరు లేకపోవడం వల్లనే వస్తున్నాయి. అందుకే తెలంగాణలో కేసీఆర్ మిషన్ భగీరథ పేరుతో ప్రతి ఇంటికీ సురక్షిత నల్లా నీరు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పథకం దాదాపుగా అమల్లోకి వచ్చింది. ఇది తెలంగాణలో కేసీఆర్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఏపీలో అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించే స్కీమ్ కు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుడుతున్నారు.


వాటర్‌ గ్రిడ్‌ పథకం పనులను మూడు దశల్లో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పథకాన్ని మొదటి దశలో భాగంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో పరిశుభ్రమైన తాగునీటి వసతి ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అదికారులను కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును ఆ జిల్లా అంతటికీ వర్తింపజేయాలని ఆయన అన్నారు.


రెండోదశలో విజయనగరం, విశాఖతో పాటు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో శుభ్రమైన తాగునీరు అందించాలని.. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీరు ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. నీటిని తీసుకున్న చోటే శుద్ధిచేసి అక్కడ నుంచి పంపిణీ చేయాలని సమావేశంలో ప్రాథమిక నిర్ణయించారు.


ప్రస్తుతం ఉన్న తాగునీటి చెరువులు, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వాటిలో తాగునీరు నింపిన తర్వాత కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఆలోచన చేయాలని జగన్ సూచించారు. వాటర్ గ్రిడ్ వంటి భారీ పథకానికి నిధుల సమస్య వచ్చే ప్రమాదం ఇంది. ఏపీ బడ్జెట్ లో సమస్యలు ఉన్నందున నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీలో తెలిపారు.


ప్రతి ఇంటికి తాగునీరందించేందుకు ప్రాజెక్టుకు సెప్టెంబర్‌లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.రూ.60 వేల కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.30 వేల కోట్ల ఆర్థికసాయం కోరామని పెద్దిరెడ్డి వివరించారు. మరి కేంద్రం సహకరిస్తే.. ఈ పథకం జగన్ సర్కారుకు మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: