రాజకీయాల్లో టైమింగ్ అంటూ ఉంటుంది. కొన్ని డైలాగులు కొన్నిసార్లు మాత్రమే చెప్పాలి.. ఆ టైమ్ దాటిపోయాక మాట్లాడితే ఉపయోగం ఉండదు. జనం కూడా నవ్వుకుంటారు. జనసేనాని పవన్ కల్యాణ్ పరిస్థి కూడా ఇలాగే ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన అనూహ్యంగా ఇప్పుడు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. జనంలో కలుస్తున్నారు.


తాజాగా రాజధాని ప్రాంతంలో పర్యటించారు. శనివారం రాజధాని రైతులతో మరోసారి సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉన్నాయి. వైసీపీకి 151 సీట్లు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ... కాలం గొప్పదనమో.. ఈవీఎంల గొప్పదనమో తెలియదు కానీ.. మీకు 151 సీట్లు వచ్చాయి..అంటూ వెటకారంగా తనదైన స్టైల్ లో నవ్వేశారు. అంటే పవన్ కల్యాణ్ కు కూడా చంద్రబాబు తరహాలో ఈవీఎంల మీద అనుమానం ఉన్నదన్నమాట. మరి ఓ రాజకీయ నాయకుడిగా అంత అనుమానం ఉంటే.. ఇప్పటి వరకూ ఆ కోణంలో ఆయన విమర్శలే చేయలేదు.


ఎన్నికల పోలింగ్ జరిగి దాదాపు 4 నెలలు దాటింది. ఫలితాలు వచ్చి కూడా 3 నెలలు దాటింది. ఇన్నాళ్లలో పవన్ కల్యాణ్ ఏనాడూ ఈవీఎంలను తప్పుబట్టిన సీన్ కనిపించలేదు. ఫలితాలకు ముందు ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు కూడా ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని అంగీకరించారు కానీ.. ఈవీఎంలను తప్పుబట్టలేదు.


మరి పవన్ మాత్రం.. ఎన్నికలు జరిగిన ఇన్నాళ్లకు ఈవీఎంల కారణంగా వైసీపీ గెలిచింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పోనీ.. అదైనా కాస్త గట్టిగా చెబుతారా అంటే అదీ లేదు.. ఏదో విమర్శించీ విమర్శించనట్టు.. అంతగా ఈవీఎంలపై అనుమానం ఉంటే.. మరి పవన్ ఇన్నాళ్లూ ఏం చేసినట్టు.. పవన్ తీరు ఎలా ఉందంటే.. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు భౌభౌ అన్నట్టుగా లేదూ.. !


మరింత సమాచారం తెలుసుకోండి: