తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఏపీలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ.. ఇది చాలామంది అంగీకరిస్తారు. అయితే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. చివరకు రాజధాని అంశం కూడా క్యాస్ట్ ఫీలింగ్ జాబితాలోకి వెళ్లిపోయింది. కేవలం కమ్మ కులానికి మేలు చేయడం కోసమే చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నుకున్నారని చెబుతుంటారు. అందుకే శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా దాన్ని తుంగలో తొక్కి కావాలని మూడు పంటలు పండే ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేశారని విమర్శిస్తుంటారు.


ఇప్పుడు జగన్ కూడా కేవలం క్యాస్ట్ ఫీలింగ్ కారణంగానే అమరావతిని అభివృద్ది చేయడం లేదని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి రాజధానిలో క్యాస్ట్ ఫీలింగ్ పోగొట్టేందుకు దమ్మున్న పత్రికగా చెప్పుకునే పత్రిక ఎండీ కొత్త సలహా ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కులతత్వం ఎక్కువన్న విషయం అందరూ అంగీకరిస్తారట. ఈ కులతత్వానికి పుట్టినిల్లు అయిన విజయవాడలో అది పోవాలంటే బయట ప్రాంతాలకు చెందినవారు అధిక సంఖ్యలో వచ్చి స్థిరపడితేనే సాధ్యమవుతుందట.


అమరావతి నిర్మాణంతో కనీసం రాజధానిలోనైనా కులతత్వం పోతుందని ఎంతోమంది ఆశించారట. అయితే అమరావతిని కమ్మవారికి మాత్రమే పరిమితం అని ప్రచారం చేయడం వల్ల మంచి చేస్తున్నారా ? చెడు చేస్తున్నారా? అని ఆలోచించుకోవాలట. సీనియర్‌ నాయకుడైన బొత్స సత్యనారాయణ వంటివారు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యాపింపజేయడం విషాదం అంటుందా పత్రిక. ప్రభుత్వం ఇప్పటికైనా తన మనసు మార్చుకుని సరైన నిర్ణయం తీసుకోని పక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్న వాస్తవం గ్రహించాలట.


అంటే.. అమరావతిని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తే రాష్ట్రం నలుమూలల నుంచి జనం వచ్చి రాజధానిలో స్థిరపడతారు కాబట్టి.. అప్పుడు అన్ని కులాల వాళ్లు రాజధానిలో ఉంటారు కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది పోతుందట.. ఇదీ ఏపీ రాజధాని నుంచి క్యాస్ట్ ఫీలింగ్ ను తరిమేయడానికి సదరు పత్రిక ఇస్తున్న సలహా.. ఎలా ఉంది..?


మరింత సమాచారం తెలుసుకోండి: