వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన వారు ఇప్పుడు ఏమయ్యారో పరిశీలించుకోవాలని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ మరణించిన నేటికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆనాటి విషయాను గుర్తు చేసుకున్నారు..


" ఆరోజు ఒక్కసారిగా కష్టాలన్నీ కళ్లెదుట రీల్‌ తిరిగాయి. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టడం, మీడియాను అడ్డుపెట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం, అసెంబ్లీలో వాళ్లు వ్యవహరించిన తీరు అన్నీ ఒక్కసారిగా.. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం రోజున గుర్తుకొచ్చాయి. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. వాళ్లు ఎంత అణిచినా నేల కేసి కొట్టిన బంతిలా జగన్‌ ముందడుగే వేశారు. సోనియా ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పిందని, వాళ్ల మాట కాదంటే ఇబ్బందులొస్తాయని చెప్పాను. అయినా జగన్‌ చేయాల్సిందేనన్నారు.. అంటూ విజయమ్మ పాత సంగతులు నెమరువేసుకున్నారు.


ఇబ్బంది పెడతారని తెలిసి నాకు భయం వేయలేదు కానీ బాధేసింది. పదేళ్లలో చాలా మంది అక్కచెల్లెమ్మలు జగన్‌తో వారి బాధ చెప్పారు. మద్యానికి బానిసైన వారి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో వారి బాధలు స్వయంగా విన్నారు.. చూశారు. అందుకే ‘ఓ వైపు ఆదాయం తగ్గినా మద్య నిషేధం అమలు చేయాలమ్మా..’ అని చెబుతున్నాడు. ఇది కష్టసాధ్యమైనా చేస్తాడనుకుంటున్నా... అంటున్నారు విజయమ్మ.


వైఎస్సార్‌ ప్రభుత్వం తొలి రోజుల్లో జీతాలిచ్చే పరిస్థితి లేదు. మంచి మనసు ఉంటే ప్రకృతి, దేవుడు సహకరిస్తారు. జగన్‌ ఎంపీ అయ్యాక 2009లో వైఎస్‌ మన మధ్యనుంచి వెళ్లిపోయారు. ఒకసారి ఎంపీలందరినీ పిలుచుకుని సోనియా, రాహుల్‌కు పరిచయం చేశారు. తర్వాత ప్రతి నెలా అపాయింట్‌మెంట్‌ అడిగారు. కానీ అవకాశం ఇవ్వలేదు. అప్పుడు మొదలైన పోరాటం మొన్నటి దాకా సాగింది. తనకెన్ని కష్టాలున్నా పక్కనపెట్టాడు.


ప్రజలకు ఎప్పుడూ తన కష్టం చెప్పలేదు. జగన్‌ ఎప్పుడూ పెద్దలను గౌరవించేవాడు. సోనియాను ఓదార్పునకు అనుమతి కోసం వెళ్లినప్పుడు.. తనకు సీఎం పదవి కావాలని కోరలేదు. ‘నాన్న చెప్పినట్లు 41 స్థానాలు మీకు అప్పగిస్తాను.. నాకు మంత్రి పదవి వద్దు.. రాష్ట్రంలో తిరగడానికి అనుమతిస్తే చాలు’ అని కోరాడు. చాలా మంది సలహా ఇచ్చినా ప్రభుత్వాన్ని పడగొట్టలేదు.. అంటూ విజయమ్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: