యురేనియం గనులు.. ఇప్పుడు తెలంగాణలో ఇదో హాట్ టాపిక్.. నల్లమల అడవుల్లోని యురేనియం నిక్షేపాలను తవ్వితీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న వార్తలతో కదలిక మొదలైంది. పచ్చని అడవులను యురేనియంతో నాశనం చేయవద్దని అనేక మంది సెలబ్రెటీలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ యురేనియం మనకొద్దని విజ్ఞప్తి చేశారు.


మరి నల్లమలలో యురేనియం కోసం తవ్వితే ఏమవుతుంది.. ఇందుకు అనేక వాదనలు వినిపిస్తున్నాయి. యురేనియం కోసం తవ్వితే.. పక్షుల కిలకిలా రావాలు వినబడాల్సిన చోట యంత్రాల హోరు మార్మోగుతుంది.. పులులు గాండ్రింపులు వినబడే చోట యంత్రాలు గర్జిస్తాయి. పచ్చని అడవంతా ఒక్కసారిగా పారిశ్రామిక వాడగా మారుతుంది. ప్రజలు నిలువునా దుమ్మైపోతారు. పచ్చని అడవి తెల్లగా మారిపోతుంది.


అంతేనా... టైగర్‌ ప్రాజెక్టు యురేనియం ప్రాజెక్టుగా మారుతుంది... కృష్ణానది కలుషితమవుతుంది. హైదరాబాదు వాసులకు మంచినీరు బదులు విషపు నీరు సరఫరా అవుతుందని పర్యావరణ వాదులు చెబుతున్నారు. ఈ యురేనియం తవ్వకాల వల్ల తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బ తింటాయని తెలుస్తోంది.


ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో యురేనియం ఫ్యాక్టరీ అనుభవాలను కూడా ఇక్కడ పరిగణన లోకి తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న విధ్వసంపై ఇటీవలే ఈనాడు దినపత్రిక సమగ్రమైన కథనం ప్రచురించింది. యురేనియం వ్యర్థాలను సరిగ్గా నిర్వహించలేకపోవడం కారణంగా.. యురేనియం ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు పండటం లేదట. అక్కడి భూగర్భ జలాలు విష తుల్యంగా మారిపోయాయట.. కేవలం పంటలే కాదు.. ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోందట.


ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొందరు మాజీ సైంటిస్టులు ఈ విషయంపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. యురేనియం కర్మాగారాల యాజమాన్యాలు చేసే దారుణాలను వెల్లడిస్తున్నారు. మరి ఇప్పటికైనా తెలంగాణా జనం మేలుకోవాలని పిలుపు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: