పుల్వామా దాడి ఘటన.. భారత ఆర్మీ చరిత్రలోనే ఇది ఓ చీకటి అధ్యాయం. ఉగ్రవాదుల దాడిలో దాదాపు 40 మంది సైనికులు బలైన దుర్ఘటన. ఈ దాడి తర్వాతే భారత్ ఏకంగా పాక్ భూభాగంలోకి అడుగు పెట్టి మరీ దాడి చేసింది. బాలాకోట్ దాడితో బదులు తీర్చుకుంది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలకు దారి తీసిన ఘటన ఇది.


అయితే.. అసలు పుల్వామా దాడి ఘటనలో భద్రతా వైఫల్యం ఎలా జరిగింది. ఉగ్రవాదులను ఎందుకు అడ్డుకోలేకపోయారు. ఇది ఆర్మీ స్వయంకృతమా.. లేక ఉగ్రవాదుల వ్యూహం విజయమా.. ఇప్పడు దీనికి కారణాలు తెలిసిపోయాయి. అవేంటంటే..

అన్నింటికంటే.. ముఖ్యమైన వైఫల్యం అతిపెద్ద కాన్వాయ్. ఒకేసారి 78 వాహనాల్లో.. 2547 మంది వెళ్లడమే చాలా డేంజర్ అయ్యిందని చెబుతున్నారు. ఇంతపెద్ద కాన్వాయ్ వెళ్లేటప్పుడు సమాచారం ఉగ్రవాదులకు ఈజీగా తెలిసిపోతుందనే విషయాన్ని ఫీల్డ్ లో ఉన్న అధికారులు పట్టించుకోలేదు.


మరో తప్పిదం.. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో సాధారణ పౌరుల వాహనాలను అనుమతించడం.. దీనివల్లే ఉగ్రవాదులు సులభంగా చొరబడ్డారు. మరో కారణం.. వాహనాల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది దగ్గర ఆయుధాలు లేవు. కేవలం వారికి భద్రగా వెళ్తున్న వారి దగ్గర మాత్రమే ఏకే 47 తుపాకులున్నాయి.


ఉగ్రదాడిలో పూర్తిగా ధ్వంసమైన వాహనంలో 39 మంది సిబ్బంది ఉంటే.. కేవలం నాలుగు తుపాకులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒకవేళ ఉగ్రవాదులు కాల్పులు జరిపినా.. జవాన్లు తిప్పికొట్టే పరిస్థితి లేదు. కానీ.. నిబంధనల ప్రకారం.. జవాన్లు వారి వారి పోస్టులకు వెళ్లాకే ఆయుధాలు ఇస్తారని అధికారులు చెబుతున్నారు.


ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని సీఆర్పీఎఫ్ కు ముందే సమాచారం ఇచ్చామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అయితే వారు.. కేవలం ఐఈడీల ప్రమాదం ఉందని మాత్రమే చెప్పారట. ఆత్మాహుతి దాడి గురించి ఎలాంటి హెచ్చరికలు సీఆర్పీఎఫ్ కు అందలేదట. ఇలా అనేక కారణాలు 40 మంది జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: