వైసీపీ, టీడీపీ మధ్య పల్నాటి యుద్ధం యుద్ధం జోరుగా సాగుతోంది. పలనాడు ప్రాంతంలో వైసీపీ నేతలు టీడీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో ఉండనీయడం లేదని.. చంద్రబాబు అంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కంటే దారుణంగా ఇప్పుడు జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారట. ఆయన వైసీపీ బాధిత కుటుంబాల కోసం గుంటూరు ఆరండల్ పేటలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు.


ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా అంటూ చంద్రబాబు హుంకరిస్తున్నారు. పల్నాడు ను మరో పులివెందుల పంచాయతీ చేస్తామంటే సహించేది లేదు.. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు బాధ్యత తీసుకోవాలి.. బాధ్యతల నుంచి పారిపోవాలని పోలీసులు చూస్తే ఊరుకునేది లేదు.. బాధితులను వెంట తీసుకుని నేనే ఊరులోకి వస్తా.. ధైర్యం ఉంటే నాపై దాడి చేయండి.. అంటున్నారు చంద్రబాబు.


అయితే.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే టీడీపీ నేతలు దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారని వైసీపీ అంటోంది. పల్నాడులో జరిగిన అరాచకాలపై చర్ఛకు తాము సిద్దమని, చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి బెదిరింపులకు దిగారని ఆరోపించారు.


సత్తెనపల్లి, నరసరావు పేటలో ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలు మరిచిపోలేదన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎవరు తప్పుడు కేసులు పెట్టారో చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సత్తెనపల్లి, నరసరావు పేటలో కోడెల చేసిన అరాచకాలు అన్ని ఇన్నీ కాదన్నారు. ప్రశ్నించిన వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలను గ్రామ బహిష్కరణ చేయడమే కాకుండా కనీసం ఓటును కూడా వేయకుండా చేశారని మండిపడ్డారు. మరి శ్రీనివాసరెడ్డి సవాల్ పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో.. ఈ పల్నాటి యుద్ధం ఏ రూపం సంతరించుకుంటుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: