మహిళ ఎన్ని సాధించినా.. మాతృత్వం పొందలేకపోతే.. అదో పెద్ద వెలితిగానే ఉండిపోతుంది. అమ్మ అయినప్పుడే అమ్మాయికి పరిపూర్ణత అంటారు. కానీ ఓ యువత తల్లి కాలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ సమాజం అవన్నీ పట్టించుకోదు. ఈ విషయంలో అది మహిళ లోపంగానే భావిస్తుంది. గొడ్రాలు వంటి పదాలతో హింసిస్తుంది.


తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి మంగాయమ్మ కూడా ఇదే సమస్య ఎదుర్కొంది.. ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఆమె అమ్మా అని పిలిపించుకోవడం కోసం ఏకంగా.. 50 ఏళ్లకు ఎదురు చూసింది. ఎవరైనా పెళ్లైన పదేళ్ల వరకూ పిల్లలు పుట్టకపోతే.. ఇక పట్టించుకోరు. కొందరు అంతగా పిల్లలు కావాలనుకుంటే సంతాన సాఫల్య పద్దతులవైపు వెళ్తారు. కానీ ఎర్రమట్టి మంగాయమ్మ దంపతులకు వాటి సంగతి పెద్దగా తెలియలేదు.


ఎర్రమట్టి మంగాయమ్మకు.. రాజారావుతో 1962లో పెళ్లయింది. ఇప్పుడు ఆమెకు 74 ఏళ్లు.. ఇటీవల ఆమెకు తెలిసిన ఒకావిడ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యింది. ఈ విషయం తెలిసాక మంగమ్మకు తానూ తల్లిని కావాలనుకుంది. గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌ను సంప్రదించింది. వారు కృత్రిమ పద్దతుల్లో ఆమెకు గర్భధారణ చేయించారు. మంగాయమ్మకు బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడం కలిసొచ్చింది.


మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోయింది. అందుకే వేరే మహిళ నుంచి అండం, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్‌ పద్ధతిలో ప్రయత్నం చేస్తే మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైంది.ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. ఇప్పుడు నెలలు నిండటంతో గురువారం ఆపరేషన్‌ కు నిర్ణయించారు. స్కానింగ్‌ ద్వారా మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి బామ్మ వయస్సులో మంగాయమ్మ అమ్మ కాబోతున్నారు. ఒకేసారి ఇద్దరు ముద్దులొలికే పిల్లలను ఎత్తుకోబోతున్నారు.. బహుశా ఇది ప్రపంచ రికార్డు కూడా కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: