రాజకీయ నాయకుడు అంటేనే గాల్లో మేడలు కడతాడు.. అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు.. ప్రజలను మాయ చేస్తాడు.. కానీ వైఎస్ జగన్ అందుకు భిన్నంగా వెళ్తున్నారు. అందుకు ఉద్దానం కిడ్నీ సమస్య ఓ ఉదాహరణ.. ఇది దశాబ్దాల క్రితమే గుర్తించారు.. ఈ సమస్యపై మీడియాలో కొన్ని వందల సార్లు కథనాలు వచ్చాయి.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇలా అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి.


కానీ ఇప్పటి వరకూ ఏ సీఎం కూడా గట్టిగా చర్యలు తీసుకోలేదు. మాటలైతే చెప్పారు కానీ.. ఎవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. కానీ జగన్.. వారి గోడు అర్థం చేసుకున్నారు. కిడ్నీ బాధితుల కోసం ఏకంగా నెలకు రూ. 10,000 పెన్షన్ ఇస్తున్నారు. అంతే కాదు.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు నడుం బిగించారు.


ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం దిశగా జగన్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో రూ.50కోట్లతో కిడ్నీ బాధితుల కోసం పలాసలో200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిధులు కూడా విడుదలయ్యాయి. అంతే కాదు..దీనికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌‌ను ఏర్పాటు చేసేలా జీవో జారీ చేశారు.


సీఎం జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలసాలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ సెంటర్‌.. ఉద్దానం ప్రజల కోసం తాగునీటి సరఫరా ప్రాజెక్ట్‌.. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం అందించే పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించ నున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన.. గురువారం మధ్యాహ్నం ఎచ్చెర్లకు చేరుకోనున్నారు. అక్కడ ఎస్.ఎం.పురం ట్రిపుల్ ఐటీలో తరగతి గదులు.. హాస్టల్ బ్లాక్‌లను ఆయన ప్రారంభించనున్నారు. తరువాత విద్యార్థులతో జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అమరావతి చేరుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: