మొండివాడు రాజుకన్నా బలవంతుడు అని ఓ సామెత.. కానీ రాజే మొండివాడైతే.. అంత కంటే బలవంతుడు ఉంటాడా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పరిస్థితి అలాగే ఉంది. ముందు నుంచి తాను నమ్మిన విషయంలో ఎవరిమాటా వినే అలవాటు జగన్ కు లేదనే పేరు ఉంది. ఇప్పుడు అధికారం వచ్చాక ప్రజాసంక్షేమం విషయంలోనూ జగన్ అదే వైఖరి అవలంభిస్తున్నారు.


ఇందుకు తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శంగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తే చాలా భారం అవుతుందని గతంలో ఓ పెద్ద స్థాయి అధికారి జగన్ కు సూచించారట. కానీ ఆయన మాట జగన్ పట్టించుకోలేదట.. నేను మాట ఇచ్చాను.. అమలు చేయాల్సిందే అని ఖరాఖండీగా చెప్పారని గతంలో వార్తలు వచ్చాయి.. తాజాగా ప్రభుత్వంలో ఆర్టీసీ కలిపేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కూడా.


అలాగే పోలవరం రివర్స్ టెండర్ల విషయం కూడా. ఈ పని చేయొద్దని ఏకంగా కేంద్రం పెద్దలు చెప్పారని కథనాలు వచ్చాయి. ఏకంగా కేంద్ర జలశక్తి మంత్రి కూడా అదే అన్నారని చెప్పారు. పోలవరం ప్రాజక్టు అథారిటీ కూడా అదే మాట చెప్పింది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది.. వ్యయం పెరుగుతుంది అని చెప్పింది. కానీ జగన్ మాత్రం ఆ మాటలు ఖాతరు చేయడం లేదు.


ప్రాజెక్టు ఆలస్యం కాకుండా.. వ్యయం పెరగకుండానే రివర్స్ టెండరింగ్ చేస్తానంటున్నాడు. ఈ మేరకు కేబినెట్ కూడా నిర్ణయించింది. రూ.3216.11 కోట్ల టెండర్‌ను గత ప్రభుత్వం నవయుగ సంస్థకు కేటాయించగా, దాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న వైయస్‌ జగన్ ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా ఉంది. తాను నమ్మితే ఎందాకైనా ముందుకెళ్లే అలవాటు జగన్ కు ఎంతవరకూ లాభిస్తుందనే కాలం తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: