పాత భవనాల్లో లంకె బిందెలు దొరికాయనే కథలు పాత సినిమాల్లో చాలా వింటుంటాం.. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌ హార్దోయి జిల్లాలో ఓ పాతకాలం నాటి నిధి బయటపడింది. ఒకాయన ఇల్లు కట్టుకుందామని నిర్మాణం ప్రారంభించాడు. పునాదుల కోసం తవ్వడం ప్రారంభించాడు. అనుకోకుండా ఓ పాత కాలం నాటి పెట్టె ఆ తవ్వకాల్లో బయటపడింది.


ఆశ్చర్యపోయిన ఆ ఇంటి యజమాని ఇదేమిటా అని ఆశ్చర్యపోయి కష్టపడి ఆ పాత పెట్టెను తెరిచి చూస్తే కళ్లు బైర్లు కమ్మేశాయి. దాని నిండా పాత కాలం నాటి నగలు లభించాయి. అందులో బంగారం, వెండి ఇతర రకాల నగలు కనిపించాయి. ఇంకేముంది.. ఆయన ఆనందం అంతా ఇంతా కాదు.. మొత్తం లెక్క వేసి చూస్తే.. 650 గ్రాముల బంగారు నగలుగా తేలాయి. ఇంకా వెండి నగలు నాలుగున్నర కేజీల వరకూ లెక్క తేలింది.


పాపం. ఆ నిధి ఆయన ఒక్కడే ఉన్నప్పుడు దొరికితే బావుండేది.. కానీ పని వారు కూడా చూశారు కదా.. అందులోనూ నిధి లాంటి వింత విషయం.. ఎంత రహస్యంగా ఉంచినా విషయం బయటకు పొక్కకుండా ఉంటుందా.. ఫలానా ఆయన ఇంటి కోసం పునాది తవ్వుతుంటే నిధి దొరికిందన్న వార్త మెల్ల మెల్లగా ఒకరి నుంచి మరొకరికి పాకింది. అలా అలా ఆ విషయం పోలీసుల దాకా వెళ్లింది.


ఇంకే ముంది లాఠీలు ఊపుకుంటూ పోలీసులు వచ్చేశారు.. ఏయ్.. మీ ఇంట్లో నిధి దొరికిందట కదా..ఎక్కడ ఉంది.. అంటూ కూపీ లాగారు. పాపం.. ఆయన ఇంటి యజమాని మొదట అబ్బే అలాంటిదేమీ లేదండీ అంటూ బుకాయించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ వచ్చింది పోలీసులు కదా.. వారు ఊరుకుంటారా.. రకరకాల సెక్షన్ల పేరు చెప్పేసరికి ఆ ఇంటి యజమాని వణికిపోయాడు.. ఎందుకొచ్చిన తలనొప్పి అని.. ఆ పాత నగల పెట‌్టె విషయం బయట పెట్టక తప్పలేదు. పాపం పోలీసులు నిబంధనల ప్రకారం ఆ నగల పెట్టెను ప్రభుత్వానికి అంద జేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: