ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ఆయన పాలనా కాలంలో తరచూ చెప్పేవారు. ఇందు కోసం ప్రపంచ దేశాలు తిరిగారు. ఎన్నో మోడళ్లు చూశారు.. కొన్నాళ్లు పుత్రజయలా కడతా అన్నారు.. మరికొన్నాళ్లు ఇస్తాంబుల్ లా కడతామన్నారు.. ఇలా ఏ దేశం వెళ్తే ఆ దేశంలా కడతామని జనంలో ఆశలు కల్పించారు.


అంతే కాదు.. లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్ కంపెనీతో డిజైన్లు గీయించారు. ఆ త్రీడీ మోడళ్లతో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం అమరావతి వ్యవహారాన్ని ఆసాంతం భూతద్దంలో పెట్టి చూస్తోంది. చంద్రబాబు సర్కారు చేసిన పనులు, ఇచ్చిన టెండర్లు అన్నీ లెక్కలు తీస్తోంది. ఇదే సందర్భంలో మంత్రి బొత్స సత్య నారాయణ రాజధాని మార్పుపై చేసిన కామెంట్లు వివాదం రేపాయి.


తాజాగా మరో వైసీపీనే రాజధానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో నానా హడావిడి చేసి... మొత్తంగా నిర్మించింది మూడు రోడ్లు, ఆరు బిల్డింగులే అంటున్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో చేయించిన పనుల్లో రూ.24,600 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అప్పు మిగిల్చి వెళ్లారన్నారు. మరో రూ.20 వేల కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారని చెప్పారు.


రాజధాని పనులపై ’కాగ్‌’ నివేదికల్లో వెల్లడైన అవకతవకలు, బీజేపీ చేసిన ప్రస్తావనలను బాధ్యత గల సీఎంగా వైఎస్‌ జగన్‌ వాటన్నిటినీ పరిశీలించి ముందుకెళ్లాలా? వద్దా? అని ప్రశ్నించారు. బ్రాహ్మణ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. మొత్తం మీద కొత్త డైలాగుతో కోన చంద్ర బాబు పరువు తీసేశారుగా..!


మరింత సమాచారం తెలుసుకోండి: