పల్నాడులో తెలుగు దేశం కార్యకర్తలను బతకనివ్వడం లేదంటూ కొన్నిరోజులుగా విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆందోళన రాజకీయం పతాక స్థాయికి చేరింది. రేపు చలో ఆత్మకూర్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం ద్వారా గుంటూరు ప్రాంతంలో పొలిటికల్ గా పై చేయి సాధించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.


వైసీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేయడం... చలో ఆత్మకూరుకు పిలుపు ఇవ్వడం, అనుకూల మీడియాలో ఈ ఇష్యూను హైలెట్ చేయడం ద్వారా రాజకీయ లబ్దికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ కూడా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాము కూడా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.


తెలుగు దేశం గూండాల దాడులను తిప్పికొడదాం అనే నినాదంతో వైసీపీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. దీంతో పలనాడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పుడు పల్నాడు చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత టెన్షన్‌ పెరిగింది. రెండు పార్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.


వైసీపీ కార్యకర్తల దాడులతో తమ కార్యకర్తలు గ్రామాలను వీడాల్సి వచ్చిందని టీడీపీ వాదిస్తుంటే.. ఇదంతా టీడీపీ డ్రామా అని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. దీంతో పలు గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అదనపు బలగాలను మోహరించాయి. గుంటూరులోని టీడీపీ పునరావాస కేంద్రంలో ఉన్న వైసీపీ బాధితులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అయితే.. పోలీసులు తమను గ్రామాల్లో వదిలిపెట్టాక.. మళ్లీ దాడులు చేస్తే కాపాడేదెవరని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమని ఊర్లలో దింపినా స్థానిక పోలీసులు ఊరుకోరని.. వారిపై తమకు నమ్మకం లేదంటున్నారు. ఈ వాదన ద్వారా టీడీపీ నాటకం ఆడుతోందని రుజువైపోయిందని తెలుగు దేశం నేతలు అంటున్నారు. మరి ఈ పల్నాటి యుద్ధం ఏ పరిస్థితులకు దారి తీస్తుందో.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: