రెండు వేల పద్నాలుగులో పోటీకి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టకేలకు పోటీ చేశారు. ఇక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేపట్టేంత కాకపోయినా కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు సాధించి అసెంబ్లీలో తన వాణి గట్టిగా వినిపించాలని అనుకున్నారు. కానీ స్వయంగా తానే రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అసెంబ్లీలో జనసేన పార్టీ సింగల్ సీటుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోవటం వల్లే ఘోరంగా ఓడిపోయామని భావిస్తున్న పవన్ రెండు వేల ఇరవై నాలుగు వరకూ జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు.


నాలుగేళ్లు ప్రజల్లోనే తిరుగుతూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు అందుకే జగన్ ప్రజా సంకల్ప యాత్ర తరహాలో సుదీర్ఘ యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల వరకూ అంటే నాలుగేళ్ల పాటు పాద యాత్ర చేసి ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. ఇక పాదయాత్రకు ఏపీలో చాలా పాపులారిటీ ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి, చంద్రబాబు, జగన్ ఇలా అందరూ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు కాళ్లకు చక్రాలు కట్టుకుని రాష్ర్టమంతా తిరిగినవాళ్ళే. తాజాగా జగన్ కూడా పాదయాత్ర తరువాతే అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఇదే ఫార్ములాను ఫాలో అయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ తో పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందే జగన్ పాద యాత్ర ప్రారంభించారు. దాదాపు పధ్ధెనిమిది నెలల పాటు నూట ముప్పై నాలుగు నియోజక వర్గాల్లో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల జగన్ పాద యాత్ర చేశారు. ఈ పర్యటనతో నియోజక వర్గాల వారిగా నేతలతో ముఖాముఖిలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటానికి జగన్ ఎంతగానో శ్రమించారు.


అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. పవన్ భీమవరం పర్యటన సమయంలో జగన్ పాదయాత్రను మెచ్చుకుంటూనే తాను కూడా పాద యాత్ర చేయాలని భావిస్తున్నట్లు తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తుంది. జగన్మోహరెడ్డి కష్టపడ్డారు కాబట్టే ఇంతటి మెజార్టీ వచ్చిందని మన పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తేనే పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే పాద యాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచనకు పవన్ వచ్చినట్లు సమాచారం. ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ ముందుచూపుతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించిన పవన్, ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఆ దిశగా అడుగులు వేయడం పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీలో కీలక నేత వ్యాఖ్యానించారు.



మరోవైపు పవన్ పాద యాత్ర అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే పాద యాత్ర చేయడం కరెక్ట్ కాదనే వాదనలు కొంత మంది వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పాద యాత్ర చేస్తే పార్టీకి ఉపయోగపడుతోందని ఇప్పటి నుంచి చేస్తే ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలు మరచిపోతారని అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల పాటు పాదయాత్ర చేయాలంటే పార్టీ ఆర్థికంగా బలంగా ఉండాలనే ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఏదేమైనా పాద యాత్ర చేయాలని పవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. జగన్ లా కాకుండా పూర్తి స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో పాద యాత్ర చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జనసేనాని ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: