ఎంపీ సుజనా చౌదరి రాజకీయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారుతోంది. కొన్నాళ్ల క్రితం ఈయన టీడీపీని వీడి బీజేపీలో చేరి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీకి సంవత్సరాల తరబడి ఆర్థిక వనరులు సమకూర్చిన పారిశ్రామికవేత్తగా సుజనా చౌదరి ఉండేవారు. ఆయన రాజకీయ నాయకుడిగా మారింది కేవలం ఐదారేళ్ల క్రితమే.


చంద్రబాబు ఏపీ సీఎంగా అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సుజనా చౌదరిని రాజ్యసభ ద్వారా ఎంపీని చేశారు. ఆ తర్వాత ఏకంగా కేంద్ర మంత్రిని చేశారు. వ్యాపారాలు తప్ప రాజకీయాలు ఏం చేస్తారులే అనుకున్న వారికి సుజనా చౌదరి షాకుల మీదు షాకులు ఇస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీకి జంప్ చేయడమే కాదు.. ఏకంగా రాజకీయాల్లోనూ డైనమిక్ గా ఉంటున్నారు.


బీజేపీలో చేరగానే సుజనా చౌదరికి చంద్రబాబు పాలనలోనూ లోపాలు కనబడుతున్నాయి. తెలుగు దేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పని చేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో తప్పొప్పులు ఎంచుతున్నారు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యమే ట్రాక్ తప్పిందంటూ చెప్పుకొచ్చారు.


పోలవరంపై సుజనా చౌదరి మాట్లాడుతూ.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా కాలయాపన చేయడంతో ట్రాక్‌ తప్పిందని కామెంట్ చేశారు. మరి చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే.. అదే పార్టీ తరపున కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఏం చేశారో మరి.


ఇప్పుడు ఏకంగా చంద్రబాబు పరిపాలనలోని లోపాలను ఎంచుతున్నారు. మొన్న పార్టీ మారే ముందు కూడా ఇలాగే సుజనా చౌదరి చంద్రబాబు పై కామెంట్లు చేశారు. తాజాగా ఆయన రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్ బీబీ హరిచందన్ ని కలిశారు. రాజధాని పట్ల రైతులు తీవ్ర అందోళనలో ఉన్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని పై ప్రకటన చేసి నెల రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి వైయస్ జగన్ దానిపై స్పందించకపోవడం దారుణమని సుజనా అంటున్నారు. మొత్తానికి సుజనా చౌదరి బాగానే రాటుదేలారుగా..?


మరింత సమాచారం తెలుసుకోండి: