ఆర్థిక నిపుణుడిగా తనను తాను అభివర్ణించుకునే మాజీ సీఎం చంద్రబాబు.. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను ఇష్టానుసారం ఖర్చు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా.. ఆదాయం- ఖర్చు అంచనాలతో పని లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ ను ఆర్థిక ఊబిలో నెట్టారని చెబుతున్నారు. ఇలా చంద్రబాబు దారి మళ్లించిన సొమ్ము దాదాపు గా 38, 500 కోట్ల రూపాయలు ఉంటుందట.


రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు ఈ లెక్కలు తాజాగా బయటపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో రూ.38,500 కోట్లను చంద్రబాబు ఇతర కార్యక్రమాలకు మళ్లించారని కన్నబాబు ఆరోపించారు. వీటిలో రూ.16వేల కోట్లు రైతులకు సంబంధించిన నిధులు ఉన్నాయట. గుంటూరులోని ఉద్యానవన శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏపీఎంఐపీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు.


చంద్రబాబు దుబారా గురించి ఆయన వివరిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా 2018-19లో ఉద్యానవన, వ్యవసాయ శాఖల పరిధిలో మెకనైజేషన్‌, ఏపీఎంఐపీ, ‘ఆత్మ’ తదితర పథకాల్లో కంపెనీలకు సుమారు రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని లెక్కలు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బిల్లుల చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో రైతులు, మెకనైజేషన్‌, ఏపీఎంఐపీ పరికరాలు పంపిణీ చేసిన కంపెనీల ప్రతినిధులు బిల్లుల చెల్లింపుల కోసం కొన్నిరోజులుగా అధికారులను అడుగుతున్నారు.


తాజాగా కంపెనీ ప్రతినిధులు, అధికారులతో భేటీ అయిన మంత్రి.... కంపెనీల బిల్లులను దశల వారీగా చెల్లిస్తామన్నారు. ఈ సమయంలో మంత్రి కన్నబాబు.. రాజకీయ విమర్శలు కూడా చేశారు. హైదరాబాద్‌లో పదేళ్లు ఉండేందుకు అవకాశమున్నా హడావిడిగా అమరావతికి వచ్చేశారన్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకుని వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నారని కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను సంయమనం పాటించాలని చెప్పుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: