సుజనా చౌదరి.. నిన్న మొన్నటి వరకూ టీడీపీ ఎంపీ.. చంద్రబాబు ఏరి కోరి ఆయనకు రాజ్యసభ సీటు అప్పట్లో కట్టబెట్టారు. దాంతో ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అలాంటి సుజనా చౌదరి మొన్నటి ఎన్నికల తర్వాత పార్టీ మారారు. పసుపు కండువా వదిలేసి కాషాయ కండువా కట్టుకున్నారు. అయితే కేవలం సుజనా చౌదరి పార్టీ మాత్రమే మారారని.. ఆయన ఇంకా టీడీపీ పాటే పాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.


తాజాగా మంత్రి బొత్స సత్య నారాయణ సుజనా చౌదరి గురించి విమర్శిస్తూ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుజనా చౌదరి మీడియా ముందుకు వచ్చి రాజధాని గురించి కొన్న అంశాలను లేవనెత్తారు. రాజధాని రైతులతో కలసి గవర్నర్ ను కూడా కలిశారు. ఈ విషయంపై బొత్స సత్య నారాయణ స్పందిస్తూ.. నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారని సుజనా పై సెటైర్లు వేసారు.


సుజనా చౌదరి అడిగితే ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా? పార్టీ కండువా మారింది తప్ప సుజనా ఆలోచన మారలేదని, పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం ఫ్యాషన్‌ అయింది’ అని బొత్స ఎద్దేవా చేశారు. సుజనా చౌదరి మూలాలు ఇంకా టీడీపీలోనే ఉన్నాయని బొత్స మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక పోతున్నారని బొత్స సత్య నారాయణ అన్నారు.


శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. ప్రతిపక్షం పెయిడ్‌ ఆర్టిస్టులతో గందర గోళం సృష్టించాలని చూస్తోంది. చిన్న చిన్న తగాదాలను భూతద్ధంలో చూపించే ప్రయత్నం చేస్తోంది. కావాలనే కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి.. అంటూ బొత్స సత్య నారాయణ మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: