ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ నేతలపై ఉన్న కేసుల విచారణ వేగం పుంజుకుంది. మాజీ స్పీకర్ కోడెల బాధితుల ఫిర్యాదులతో మొదలైన కేసులు.. ఇప్పుడు చింతమనేని వరకూ వచ్చాయి. ఒక్కో నేతకు వందల్లో బాధితులు ఉండటం.. చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డి, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు సోదరుడు.. ఇలా అందరి మీద వివాదాలు ముసురుకుంటున్నాయి. 


గత ఐదేళ్లూ ఏపీ స్పీకర్ గా చక్రం తిప్పిన కోడెల శివప్రసాదరావుకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. జగన్ సీఎం అయిన దగ్గర్నుంచీ కోడెల బాధితులమంటూ సత్తెనపల్లి, నర్సరావుపేటలో వందలాది కేసులు నమోదయ్యాయి. కోడెలతో పాటు ఆయన కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మిపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల కంటే.. సొంత పార్టీకి చెందిన నేతలే ఎక్కువ కేసులు పెట్టడం టీడీపీనే విస్మయానికి గురిచేసింది. 


మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడిపై నమోదైన కేసుల్లో  మొదటి అరెస్ట్ జరిగింది. సత్తెనపల్లి  స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ లో ల్యాప్‌టాప్స్ మాయం కేసులో 2వ నిందితుడు అజయ్ చౌదరిని అరెస్ట్ చేశారు సత్తెనపల్లి పోలీసులు. మొదటి నిందితుడు కోడెల శివరామ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.  ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోందని మరి కొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుంటామని సీఐ  తెలిపారు. 


భూ కబ్జా కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి వెంకటాచలం పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఇడిమేపల్లిలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో 2.4 ఎకరాల భూమిని సోమిరెడ్డి, మరో నలుగురు కలిసి కబ్జా చేశారని ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ భూమికి సంబంధించి తన వద్ద ఉన్న ఒరిజినల్ పేపర్లను పోలీసులకు చూపించారు సోమిరెడ్డి. బెజవాడ నడిబొడ్డున  200 ఎకరాల విలువైన భూవివాదం రాజకీయ కలకలం రేపుతోంది. ప్లానింగ్‌ బోర్డు మాజీ వైస్‌ఛైర్మన్‌ కుటుంబరావు సోదరుడు నాగేంద్రపై భూవివాదం ఆరోపణలు ఉన్నాయి. మధురానగర్‌లో నాగేంద్ర ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని,  ఆయన పెట్టిన బోర్డులు తొలగించారు అధికారులు. ప్రభుత్వ భూమి అని.. ఎవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులన్న బోర్డు పెట్టారు అధికారులు.  స్థలం గేటుకి నోటీసులు అంటించారు జేసీ మాధవీలత. కోర్టు ఆదేశాలతో గతంలో నాగేంద్రకు ఆ స్థలం అప్పగించింది రైల్వేశాఖ. ఈ స్థలంలో నిర్మించిన భవనాలని కూల్చివేశారు అధికారులు. 


దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భాదితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి క్యూకడుతున్నారు.  ఇంతకాలం భయంతో ఉన్న భాదితులు.. చింతమనేని జైలుకెళ్లడంతో ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. దీంతో ఏలూరు డీఎస్పీ కార్యాలయం చింతమనేని భాదితులతో బిజీగా మారిపోయింది. టీడీపీ హయాంలో ప్రభాకర్ వద్ద పనిచేసిన నాయకులు సైతం భాదితులమేనంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది టీడీపీ నేతలపై కేసులు బుక్ చేయడానికి రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: