అధికారం ఉంటే ఒకలా...అధికారం లేకపోతే మరొకలా...ఇదే సూత్రాన్ని ఏపీలో కొందరి టీడీపీ నాయకులు బాగా ఫాలో అవుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చుట్టూ చేరి మీరు ఎంత అంటే అంత అనేలా భజనలు చేసిన నేతలు...అధికారం కోల్పోగానే చేద్దాంలెండీ...చూద్దాంలెండీ అంటున్నారు. బాబు ఏం చెప్పిన పెద్దగా లెక్క చేయనితనంతో ఉంటున్నారు. అసలే ఓటమి పాలై కష్టాల్లో ఉన్న పార్టీని కొంచెం గాడిలో పెడదామని చూస్తుంటే..అందుకు నేతలు బాబుకు సహకరించడంలేదు. పార్టీ తర‌పున ఏ కార్యక్రమం చేపట్టిన పెద్ద ఆసక్తికనపరచడం లేదు.


తాజాగా వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్న చంద్రబాబు... వైసీపీ నేతల భారీన పడి ఇబ్బందులు పడుతున్న బాధితులు కోసం ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.  అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కొందరు రావడానికి ప్రయత్నిస్తే వారిని అక్కడిక్కడే పోలీసులు గృహ నిర్బంధం చేసేశారు. ఆఖరికి చంద్రబాబుని కూడా గృహ నిర్బంధం చేశారు.


అయితే ఈ కార్యక్రమం ఎలా జరిగినా... కొందరు నేతలు మాత్రం చంద్రబాబు పిలుపుని అసలు పట్టించుకోలేదు. ఇది మనకెందుకులే అన్నట్లున్నారు. అందులో ఒక మాజీ మంత్రి డైరెక్ట్ గా చంద్రబాబుకే షాక్ ఇచ్చారు. ఆ కార్యక్రమం ముందు రోజు రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రికి చంద్రబాబు కాల్ చేసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని చెబితే.... ఆ మంత్రి మూడు నెలలకే ఏ పోరాటం చేస్తాంలే సర్ అంటూ లైట్ గా మాట్లాడారట. ఇక ఈయనే కాదు చాలామంది నేతలు చంద్రబాబు పిలుపుని లైట్ తీసుకున్నారు.


ఇక  ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమం వైపు తొంగి చూడలేదు. విజయనగ‌రం నుంచి చంద్రబాబు పిలుపునకు పెద్దగా స్పందన లేదు. ఇక శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు తప్ప మరొకరు కనపడలేదు. అటు రాయలసీమ నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. అందులో ముఖ్యంగా కడప జిల్లా నేతలు అసలు పట్టించుకోలేదు. మొత్తానికైతే ఓడిపోయాక బాబు నేతలకు బాగా అలుసైపోయినట్లున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: