పంచుకోవడం మొదలుపెడితే ముంత, గిన్నె అన్నీ కూడా లెక్కలోకి వచ్చేస్తాయి. చిల్లి గవ్వకు పనివస్తుందనుకుంటే ఏ ఒక్కటీ వదలరు. నీళ్ళు, నిధులు అంటూ మెల్లగా మొదలైన తెలంగాణా ఉద్యమం చివరకి ఎటు దారితీసిందో అందరికీ తెలుసు. తెలంగాణా రాష్ట్రమే విడిపోయింది. ఏమీ లేని ఏపీ మాత్రం మిగిలింది ఇదిలా ఉండగా ఇపుడు నవ్యాంధ్రలో పదమూడు జిల్లాలు కలసి ఉంటాయా ఉండవా అన్న సందేహం కూడా వస్తోంది.


దానికి కారణం మొన్నటి కాంగ్రెస్, నిన్నటి టీడీపీ, నేటి బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రోజుకో రకంగా చేస్తున్న విభజన కామెంట్స్. నిన్న రాయలసీమకు ఒక రాజధాని ఇవ్వాల్సిందే అంటూ శ్రీభాగ్ ఒప్పందాన్ని గుర్తు చేసిన ఆయన ఈ రోజు దేవుళ్ళు, దేవాలయాల మీద పడ్డారు.  తిరుపతి వెంకన్న ఆలయం రాయలసీమలో ఉందిట. అందువల్ల ఆ ఆదాయం అంతా సీమకు దక్కాలంట. ఇలా కొత్త వింత వాదనను ముందుకు తెచ్చారు టీజీ.


సింహాచలం, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాల ఆదాయం ఆయా ప్రాంతాలకు  ఖర్చు పెడుతున్నారని, అందువల్ల టీటీడీ  ఆదాయమైనా రాయలసీమకు ఇవ్వాలని కోరుతున్నారు. అంటే వెంకన్నను సీమవాసిని చేసేశారన్నమాట. ఇదిలా ఉంటే రాయలసీమ నీళ్లు అక్కడే ఉంచాలని, శ్రీశైలం నీళ్ళు చుక్క కూడా ఇతర ప్రాంతాలకు ఇవ్వరాదని కూడా అంటున్నారు. కోస్తా ప్రాంతాల వారికి గోదావరి నీళ్లను ఇచ్చి సీమ నీళ్ళు వదిలేయాలని, అలా చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.


ఇక సీమ విషయంలో అభివ్రుధ్ధి ప్రాజెక్టులు ప్రకటించకపోతే ఆందోళన చేపడతామని కూడా టీజీ హెచ్చరిస్తున్నారు. మొత్తానికి టీజీ విషయం ఎలా ఉందంటే కాదేదీ రాజకీయం అంటూ ఆఖరుకి ప్రపంచ దేవుడైన వెంకన్నని సీమ దేవుడిగా చేసేస్తున్నారు. మరి ఇక్కడితో ఆగుతారా ఇంకా కొత్త డిమాండ్లు పెడతారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: