జగన్  కాంగ్రెస్ ని విడిచి సొంతంగా రాజకీయాల్లోకి వచ్చినపుడు  ఆయనకు ఎదురు నిలిచిన వారు కాంగ్రెస్ లో ఎందరో ఉన్నారు. ఉద్ధండ పిండాలైన మేటి నాయకులు కూడా జగన్ని నిందించారు, అడుగడుగునా అడ్డుకున్నారు. వారంతా వైఎస్సార్ కి అత్యంత సన్నిహితులే కానీ జగన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాట మార్చేశారు, ప్లేట్ ఫిరాయించేశారు. ఈ నేపధ్యంలో జగన్ ఎన్నో అవాంతరాలను, ఇబ్బందులను చవిచూశారు. అయినా మొక్కవోని దైర్యంతో జగన్ అన్నింటినీ ఎదుర్కొన్నాడు. అయితే జగన్ని బాగా బాధపెట్టిన సంఘటన ఒకటి ఉంది. 


అదే జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి జగన్ కు ఎదురునిలవడం. తొడగొట్టి మరీ సవాల్ చేయడం. పైగా తల్లి లాంటి విజయమ్మ మీద పోటీకి దిగడం. ఇవన్నీ జగన్ని మానసికంగా క్రుంగిపోయేలా చేశాయని అంటారు. వివేకాకు మంత్రి పదవి ఇచ్చి జగన్ కుటుంబాన్ని వేరు చేసేందుకు కాంగ్రెస్ అధినేత్రి  తయారైతే దానికి వివేకా పావుగా మారి తనపైనే బాణాలు వేయడాన్ని జగన్ అసలు  తట్టుకోలేకపోయారు


ఈ పరిణామాలతో జగన్ ఎంతో మధన చెందారని చెబుతారు. తరువాత జగన్ బంపర్ మెజారిటీతో కడప లోక్ సభ సీటు గెలవడం, విజయమ్మ సైతం పులివెందుల అసెంబ్లీ సీటును భారీ మెజారిటీతో  గెలవడం జరిగాయి. ఆ తరువాత వివేకా సైతం మనసు మార్చుకుని జగన్ పార్టీలో చేరిపోయి అబ్బాయికి ఎంతో ఆసరాగా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉండగా జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలని వివేకా ఎంతగానో తపించారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన దారుణంగా హత్యకు గురికావడం జగన్ని బాగా కలచివేసింది.


ఆ హత్యకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని జగన్ విపక్ష నేతగా డిమాండ్ చేశారు. ఇపుడు జగన్ సీఎం అయ్యారు. వివేకా దారుణ హత్యకు గురి అయి ఏడు నెలకు గడిచాయి. అయినా సరే ఆ కేసు కొలిక్కి రాలేదు, వివేకాను ఎవరు హత్య చేశారన్నది ఇప్పటికీ మిష్టరీగా మిగిలింది. ఈ నేపధ్యంలో జగన్ మీద వత్తిడి అలా ఇలా ఉండడం లేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని సీబీఐ విచారణని  జనసేనాని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. 


ఇక మరో వైపు లోకేష్ కూడా సీబీఐ విచారణకు ఎందుకు జగన్ ఆదేశించరని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు నోట కూడా తరచూ వచ్చే మాట ఇదే. సొంత బాబాయ్ చనిపోతే ఆ కేసుకే దిక్కులేదు, అదీ జగన్ పాలన అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు వివేకా కుటుంబ సభ్యులు సైతం ఈ కేసు అలా ఎటూ కాకుండా నిలిచిపోవడం పట్ల అసహనంగా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ సీఎం అయ్యారన్న ఆనందం కంటే బాబాయ్ వివేకా మళ్ళీ ఎదురునిలిచి వెంటాడుతున్న పరిస్థితులే ఇబ్బందిగా ఉన్నాయని అంటున్నారు. ఈ కేసు పరిష్కారం అయితే తప్ప జగన్ కి మనశ్శాంతి ఉండదని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: