హిందీ భాషపై మరోసారి రగడ మొదలైంది.. మొన్న హిందీ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ.. ఆ తర్వాత అమిత్ షా చేసిన కామెంట్లు సౌత్ ఇండియాలో కాక రేపుతున్నాయి. హిందీ భాష సులభమైన, అప్పటికప్పుడు మాట్లాడగల్గిన, అందమైన భాష అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని...ఆయా లక్షణాలను హిందీ తనలో అందంగా పొందుపర్చుకుందని ప్రశంసించారు.


ఇక అమిత్ షా ఓ అడుగు ముందుకేశాడు. మాటను వెల్లడించడంలో ఈ భాష అర్ధాన్ని ఇస్తుందని అన్నారు. హిందీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష..దేశాన్నంతా ఐక్యం చేస్తుందని ట్విట్టర్ లో అన్నారు. ఒకే దేశం, ఒకే భాష ఉండాలని భావించిన మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను నిజం చేసేలా హిందీని తరచూ మాట్లాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


అక్కడితో ఆగితే బావుండేది.. కానీ హిందీని రాష్ట్ర భాషగా మారుస్తామని అన్నారు. ఇక్కడే సౌత్ ఇండియా లీడర్లకు మండుకొచ్చింది. హిందీయేతర ప్రాంతాలకు చెందిన విపక్ష నాయకులు తప్పుబట్టారు. ముందుగా స్పందించిన మమతా బెనర్జీ.. ప్రజలు అన్ని భాషలను, సంస్కృతులను గౌరవించాలని కామెంట్ చేశారు. మాతృభాషను మాత్రం మర్చి పోకూడదని సూచించారు. ఇక తమిళం అంటే పడిచచ్చిపోయే భాషాభిమానం ఎక్కువ ఉన్న తమిళులు అయితే అమిత్ షాను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.


అమిత్ షా వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశ ప్రజల మనోభావాలను కూడా పరిశీలించాలని పాండిచ్చేరీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా కామెంట్ చేశారు. ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు సుమా.. !


మరింత సమాచారం తెలుసుకోండి: