గోదావరి బోటు ప్రమాదంలో దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ బోటు ప్రమాదంలో నిర్వాహకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. అనుమతి లేకుండా వెళ్లడం.. అనుభవం లేని డ్రైవర్లను పెట్టుకోవడం.. లైఫ్ జాకెట్ల విషయంలో పర్యాటకులను అప్రమత్తం చేయకపోవడం.. ఇలా నిర్వాహకుల తప్పుల జాబితా చాలా ఉంది.


అయితే.. ఇవి ఎన్ని ఉన్నా.. చివరినిమిషంలో నిర్వాహకులు చేసిన ఓ ఘోర తప్పిదం 40 మందిని బలితీసుకుంది. బోటు ప్రమాదం జరిగే ముందు ఓ భారీ కుదుపునకు గురైందట. ఆ సమయంలో కనీసం నిర్వహకులు అందర్నీ లైఫ్ జాకెట్లు వేసుకోమని హెచ్చరించినా చాలా మంది బతికే వారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


ప్రమాదం జరగడానికి ముందు బోటు నడిపే సిబ్బంది కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు చెబుతున్నారు. బోటు కుదుపుకు గురైన తర్వాతే ఈ ప్రాంతం డేంజర్ జోన్ అని బోటు నడిపే వ్యక్తి పర్యాటకులకు చెప్పాడట. కనీసం అప్పుడైనా లైఫ్ జాకెట్లు వేసుకోమని చెప్పి ఉంటే.. చాలా మంది బతికేవారు.


పడవ ప్రమాదంలో మునిగిపోయిన వారిలో చాలామందికి ఈత వచ్చు.. కానీ గోదావరి భారీ ప్రవాహం.. బోటు తమ మీద పడటం వంటి కారణాలతో వారు ఈదలేకపోయారు. ఆ సమయంలో లైఫ్ జాకెట్ ఉంటే చాలా మంది బతికేవారని ప్రమాదం నుంచి బయటపడినవారు గుర్తు చేసుకుంటున్నారు.


ఈ ప్రమాదం జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే తూటుగుంట గ్రామస్తులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు సేఫ్ జాకెట్లు వేసుకున్న చాలామందిని .. దాదాపు 30 మందిని కాపాడారు. దేవీపట్నం పోలీసులు తమ బోటుకు అనుమతి ఇచ్చారని.. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే బోటు ముందుకు కదిలేదే కాదని అంటున్నారు. బోటుకు అనుమతి ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: