ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ప్రజల కష్టసుఖాలపై అవగాహన ఉండాలి.. ఏం చేస్తే వారు జీవితాలు బాగుపడతాయో ఆలోచించాలి.. అధికారంలో ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.. ప్రజలను బాగుపరచడం సంగతి పక్కకు పెట్టి.. వాళ్లను మరింత ఇబ్బంది పెట్టకుండా ఉంటే అదే పదివేలు. ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్లు అంటే సీఎం కుర్చీలో ఉన్న ఒక్కరే కాదు. మొత్తం పార్టీ కూడా.


మొన్నటి చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయిందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు కాదు.. చింతమనేని వంటి నాయకుల ఓవరాక్షన్.. కోడెల కుమారుల వంటి వారి అరాచకాలు కారణం. ఇదే విషయం వైసీపీకీ వర్తిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మల్యే కుమారుడు వీరంగం సృష్టించాడు.


మనం అధికార పార్టీలో ఉన్నాం.. మనల్ని అడిగేదెవడని.. రెచ్చిపోయాడు. తన పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని నాలుగు రోడ్ల సెంటర్‌ లో నడి రోడ్డుపై జరుపుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు.. ఇక అడిగేదెవడు.. దీని కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. జనం నానా ఇబ్బందులు పడ్డారు.


మూడు గంటలపాటు ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేకపోయింది. ప్రయాణీకులు తీవ్రమైన అవస్థకు గురయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు కదా.. పోలీసులు కూడా సైలైంటైపోయారు. ఇదంతా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ నిర్వాకం.


ఇలాంటివి మెయిన్ మీడియాలో ప్రముఖంగా వచ్చినా రాకపోయినా... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయి. షేర్ల మీద షేర్లు అవుతాయి. కామెంట్లు ఘాటుగా వస్తాయి. మొత్తం మీద ప్రజాభిప్రాయాన్ని కూడగడతాయి. అందుకే ఇలాంటి ఓవరాక్షన్ నేతల పట్ల సీఎం జగన్ ఓ కన్నేసి ఉంచాలి. ఇలాంటి పోకడలను ఆదిలోనే అరికట్టకపోతే.. ఆనక టీడీపీ తరహాలో విచారించాల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: