ఏపీలోని ప్రముఖ మీడియా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ పైన వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలకు పదును పెడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపర్ లీక్ అంశంపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వరుస కథనాలు ప్రచురించడంతో దీనిపై చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకునే నిర్ణయాలను ఓర్వలేక చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏబీఎన్ రాధాకృష్ణకు కట్టబెట్టిన పనులపై విచారణ చేపట్టాలన్నారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్‌ ఆర్కేలో అసలు ఓపెన్ హార్ట్ ఉందా అని ప్రశ్నించారు.


ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని అమరనాథ్ ఆరోపించారు.బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్‌ వస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు,ఎబిఎన్ ,ఆంద్రజజ్యోతి రాధాకృష్ణ తట్టుకోలేకపోతున్నారని మరో నేత జంగా కృష్ణమూర్తి అన్నారు.


గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ఒకేసారి లక్షా 27 వేల పోస్టులు భర్తీ చేయడం ఒక చరిత్ర అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కాలని వాళ్లిద్దరూ కంకణం కట్టుకున్నారని , అందుకే బీసీ నేతలను బాడుగ నేతలుగా రాధాకృష్ణ తన పేపర్‌తో పాటు చానెల్‌లో బహిరంగంగానే అభివర్ణించారని దుయ్యబట్టారు.


రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదని రాధాకృష్ణ ఉద్దేశమని, పత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వెళ్లగక్కారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలా వీరిద్దరే కాదు.. చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పై విమర్శలు గుప్పించారు. ఈ వార్ ఎంతవరకూ వెళ్తుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: