అక్రమకట్టడాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు . లింగమనేని గెస్ట్ హౌస్  అక్రమ నిర్మాణం అని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి,  ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అందులో  నివసించడం  ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు. ఒక  వైపు అక్రమ కట్టడం లో నివసిస్తూనే ,  మరోవైపు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడం హాస్యాస్పదంగా ఉందని బొత్స సత్యనారాయణ  విమర్శించారు. నది పరివాహక ప్రాంతం లో అక్రమ నిర్మాణాల పట్ల ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడం ద్వారా... లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేత ఖాయమంటూ సంకేతాలను ఇచ్చారు .


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతోంది.  ఇప్పటికే గెస్ట్ హౌస్  ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని పేరిట  సిఆర్డిఏ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. వారం రోజుల్లోగా గెస్ట్ హౌస్ ఖాళీ చేయడం తోపాటు , అక్రమ నిర్మాణాన్ని కూల్చుకోవాలని సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన తుది నోటీసుల్లో పేర్కొన్నారు .  ఈ శుక్రవారంతో సీఆర్డీఏ  అధికారులిచ్చిన  గడువు పూర్తి కానుండటంతో లింగమనేని గెస్ట్ హౌస్ ను ఇక  కూల్చివేయడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.


  సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసిన ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే  ప్రారంభించారు.  చంద్రబాబు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఉన్న పాతూరి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నిర్మించిన ర్యాంపును సీఆర్డీఏ అధికారులు ముందుగా కూల్చివేశారు.  ఆ తర్వాత ఆ ఇంటి  సమీపంలో ఉన్ననాలుగు నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు.  అందులో  చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా  ఉందని సిఆర్డిఏ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.  దీంతో చంద్రబాబు నివాసం కూల్చివేత ప్రక్రియ ఈ శుక్రవారం తరువాత  ఎప్పుడైనా ప్రారంభం కావచ్చునని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: