కొన్నిరోజుల క్రితం గోదావరిలో తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద టూరిస్టు బోటు నీటిలో మునిగి దాదాపు 50 మంది వరకూ గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే బోటు ప్రమాదం జరిగిన రోజు.. పడవ మునిగిపోవడం ప్రత్యక్షంగా చూసిన కచ్చులూరు ప్రాతంలోని గిరిజనులు.. అద్బుతంగా స్పందించారు.


వెంటనే తమ పడవలతో గోదావరిలోకి వెళ్లి లైఫ్ జాకెట్లు వేసుకుని గోదావరిలో తేలుతున్నవారిని తమ బోట్లలో ఎక్కించుకుని వారి ప్రాణాలు కాపాడారు. వీరు దాదాపు 26 మంది ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిని గుర్తించి కానుకలు అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.


సంఘటన జరిగిన వెంటనే కచ్చులూరి గ్రామస్తులు కొంత మంది ఒడ్డు నుంచి చూసి ప్రమాదంలో ఉన్న 26 మందిని కాపాడారని మంత్రి కన్నబాబు వివరించారు. వారిని సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారని చెప్పారు. గిరిజనుల విషయాన్ని సీఎంకు వివరించామన్నారు. ఆ రోజు సాహసం చేసి ప్రయాణికులను కాపాడారో వారికి నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.25 వేలు ప్రోత్సహక నగదు ఇస్తున్నామన్నారు.


గిరిజనుల సాహసం 26 మందిని కాపాడిందని, వారికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక సేవా కార్యక్రమం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచూకీ లభ్యం కాని వ్యక్తులకు సంబంధించి డెత్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని బాధితుల బంధువులు కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని కన్నబాబు వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఆలస్యంగానైనా గిరిజన సాహసికులను గుర్తించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: