ఏంటో.. ఈ మధ్య సుజనా చౌదరి ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు షాకు మీద షాకులు ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు చలవ వల్లే రాజ్యసభ సభ్యుడు.. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయిన సుజనా చౌదరి ఇప్పటికీ చంద్రబాబు మనిషే అన్న పేరు ఉంది. ఆయన కొన్ని నెలల క్రితం బీజేపీలో చేరినా ఆయన ఇంకా టీడీపీ పాటే పాడుతున్నారని చాలా మంది విమర్శిస్తున్నారు కూడా.


పాపం.. అందుకేనేమో ఇటీవల సుజనా చౌదరి చంద్రబాబుపై అనూహ్యమైన కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే చంద్రబాబుకు చెప్పినా తమ మాట వినలేదని కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు ఇంకాస్త డోసు పెంచారు. అసలు 2014 ఎన్నికల్లోనే వైసీపీ అధికారంలోకి రావాల్సిందని ఇప్పుడు ఘాటు కామెంట్లు చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన టీడీపీకి అండగా నిలవడంతో వైసీపీ ఓటమిపాలైందని సుజనా చౌదరి అన్నారు.


బీజేపీ సపోర్ట్, పవన్ కల్యాణ్ సపోర్ట్ ఉండబట్టే 2014లో చంద్రబాబు సీఎం కాగలిగారని సుజనా చౌదరి అంటున్నారు. అంతే కాదు.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతోనే టీడీపీ ఓడిపోయిందన్నారు. ఒకవేళ గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ తాను బీజేపీలోచేరేవాడినని సుజనా చౌదరి స్పష్టంచేశారు.


సుజనా చౌదరి ఏపీ బీజేపీలో కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. అందుకే తనపై ఉన్న టీడీపీ ముద్రను పూర్తిగా చెరిపేసుకునే ప్రయత్నంలోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో తెలుగు దేశం పార్టీ ఎలాగూ తన ప్రాభవం కోల్పోతుందని..ఇక రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ మాత్రమే కీలక పార్టీలుగా ఉంటాయని అంచనాలు ఉన్నాయి.


అందుకే బీజేపీలో తన పరపతి పెంచుకోవడానికి.. మంచి స్థానం పొందడానికి సుజనా చౌదరి తాపత్రయపడుతున్నారేమో అనిపిస్తోంది ఆయన తాజా కామెంట్లు చూస్తుంటే. రాష్ట్ర బీజేపీలోని నాయకత్వ కొరత కూడా సుజనా చౌదిరికి కలసి వచ్చేలా ఉంది. అయితే ప్రజానాయకుడిగా జనంలోకి వెళ్లలేకపోవడం సుజనా చౌదరి వీక్‌నెస్. మరి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: