ఇక నేటి నుంచి వైఎస్ జగన్ మార్కు పరిపాలన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కాబోతోంది. అదేంటి ఇప్పటి వరకూ జగన్ పాలన కాదా అనుకోవచ్చు. కానీ.. ఇక నుంచి అసలైన జగన్ పాలన ప్రారంభం కానుంది. జగన్ మార్కుగా చెప్పుకుంటున్న సచివాలయ పాలన, గ్రామవాలంటీర్ల వ్యవస్థ నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థ కొత్తగా అమల్లోకి వస్తోంది.


తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఈ వ్యవస్థను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి 10.30 గంటలకు కరపకు చేరుకుంటారు. గ్రామ సచివాలయ పైలాన్ఆవిష్కరణ, సచివాలయ కార్యాలయం సందర్శన అనంతరం 10. 55 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. జడ్పీ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి గ్రామ సచివాలయ సిబ్బందితో ముఖా ముఖి మాట్లాడతారు.


గ్రామ, వార్డు కార్యదర్శిలకు గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందజేస్తారు. ప్లాస్టిక్ నిషేధంపై ఆహుతులతో ప్రతిజ్ఞ చేయిస్తారు. 12.10 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభమవుతుంది. 1.10 గంటలకు పింఛన్లు, బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ, స్వచ్చ అవార్డుల ప్రదాన కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం 1.25 గంటలకు బయలుదేరి హెలిప్యాడ కు చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తారు.


గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయాలతో ఆంధ్రప్రదేశ్ పల్లెల ముఖ చిత్రం మారబోతోంది. వీరి సేవలు బావుంటే అది జగన్ మార్కుగా జనంలోకి వెళ్తుంది. ఇది ప్రజల్లో ఆయనకు మంచి పేరు తెస్తుంది. వీరి సేవలు అంత సంతృప్తికరంగా లేకపోతే..అది కూడా జగన్ మైనస్ గానే చెప్పుకుంటారు. కాబట్టి ఇది జగన్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగానే చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: