ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఏపీలో సంచలనం సృష్టించింది. ఇక టీడీపీ అధినేత ఈ విషయాన్ని రాజకీయంగా ఎంతవరకూ వాడుకోవచ్చో..అంతవరకూ వాడుకున్నారు. ఆయన మొదటి సారి ఆత్మహత్యయత్నం చేసినప్పుడు ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు..ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాత్రం దాన్ని రాజకీయంగా మైలేజ్ కోసం వాడుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.


రాజకీయంగా ఇదే అదనుగా చంద్రబాబు ప్రతివేదిక పైనా వైసీపీ కోడెలను పొట్టన పెట్టుకుందని విమర్శిస్తున్నారు. దీనికి వైసీపీ కూడా గట్టిగానే స్పందించిది. మొదట్లో కోడెల ఆత్మహత్యను బాధాకరమని ప్రకటించిన వైసీపీ.. ఆ తర్వాత డోసు పెంచుతోంది. చంద్రబాబు రాజకీయం చూసి తన పొలిటికల్ విమర్శల్లో ఘాటు పెంచుతోంది.


తాజాగా ఆ పార్టీ చంద్రబాబుకు కొన్నిప్రశ్నలు సంధిస్తూ ఓ లేఖ రాసింది. చంద్రబాబు పాలనకు వైయస్‌ జగన్‌ పాలనకు మధ్య తేడాలను చూపిస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్‌లు సంయుక్తంగా బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ధోరణిని తీవ్రంగా ఎండగడుతూ ఈ ప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు.


అందులో ఓ ప్రశ్న ఇలా ఉంది.. మీ జన్మభూమి కమిటీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది? మా గ్రామ సచివాలయాల ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగింది, ఈ రెండూ అసలు పోల్చతగినవేనా.. ? ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే పల్లె ప్రజలకు, పల్లెల్లోనే వారి గుమ్మం వద్దే అన్ని కార్యక్రమాలు అందుతుంటే ఈ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి ... మీ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఓ ఫ్యాక్షనిస్టుని మహానాయకుడిగా చూపించడం మీకు సిగ్గుచేటు కాదా ?.. ఇదీ ప్రశ్న.. అంటే కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత కూడా వైసీపీ ఆయన్ను ఫ్యాక్షనిస్టుగా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: