గాంధీ జయంతి వేళ ఆంధ్రప్రదేశ్ అంతటా సచివాలయ సంబరాలు మొదలయ్యాయి. జగన్ మానసిక పుత్రిక అయిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఊపిరిపోసుకుంది. ఇది గతంలోనూ ఉన్నా నామమాత్రంగా ఉండేది. ఇప్పుడు జగన్ దాన్ని ప్రత్యేక వ్యవస్థగా రూపొందించి ఉద్యోగుల సంఖ్య పెంచి బలోపేతం చేశారు. ఐతే.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం అవుతుంటే.. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం వీటిపై విమర్శలు సంధించారు.


సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని.. వైసీపీ వారికే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన పగ్గాలు చేపట్టి నాలుగు నెలల్లోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు.


సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పాలన ప్రతి గడప ముందుకు తీసుకువచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకువచ్చారన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకంలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే అక్రమాలు ఎక్కడ జరిగాయో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నారన్నారు.


సచివాలయ ఉద్యోగాలపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలపై అంబటి రాంబాబు ఇలా విరుచుకుపడుతుంటే.. మరికొందరు వైసీపీ నేతలు గ్రామ సచివాలయ వ్యవస్థ తీరు తెన్నులు ప్రజలకు వివరించారు. ఇది ఓ మైలు రాయి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిదే అని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: